ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టివేసింది. ఏసీబీ కోర్టు కోర్టు తీర్పును హైకోర్టులో సిట్ సవాల్ చేసింది. ఏసీబీ కోర్టునే హైకోర్టు సమర్ధించింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ సహా మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లను నిందితులుగా చేర్చుతూ సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.ఈ విషయమై విచారణ నిర్వహించిన తర్వాత ఈ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు నోటీసులు జారీ చేసిన తర్వాత నిందితులుగా చేర్చుతున్నట్టుగా మొమో దాఖలు చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు అప్పట్లో తమ వాదనలు విన్పించారు.ఈ విషయమై వాదనలు విన్న ఏసీబీ కోర్టు సిట్ దాఖలు చేసిన మెమోను గత ఏడాది డిసెంబర్ ఆరో తేదీన కొట్టివేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో గత ఏడాది డిసెంబర్ ఏడో తేదీన రివిజన్ పిటిషన్ ను దాఖలు చేసింది సిట్ . ఈ రివిజన్ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది.
undefined
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 26న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే . సిట్ దర్యాప్తును కూడా నిలిపివేసింది. సిట్ విచారణ పారదర్శకంగా సాగడం లేదని పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది. సుమారు 90 పేజీలతో హైకోర్టు జడ్జిమెంట్ ను వెల్లడించింది. ఈ విషయమై సిట్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులపై బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నోటీసులపై తెలంగాణ హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.
గత ఏడాది అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫాంహౌస్ లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కేసు నమోదైంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు ప్రలోభాల కు గురి చేస్తున్నారని కేసు నమోదైంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలతో రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: సీబీఐకి చేరిన హైకోర్టు తీర్పు కాపీ
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ప్రలోభాల వెనుక బీజేపీ ఉందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమ పార్టీలో చేర్చుకోవాలంటే నేరుగా చర్చలు జరుపుతామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో పోలీసులకు చిక్కినవారితో తమకు సంబంధం లేదని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.