తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చైర్మన్‌గా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ నేతృత్వంలో టీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్‌టీసీ ప్రజలకు మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ నేతృత్వంలో టీఎస్‌ఆర్టీసీ ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఈ బాధ్యతను అప్పగించిందని, తనను టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ తన శక్తి మేరకు సంస్థ ఎదుగుదలకు సహకరిస్తానని తెలిపారు.
ఈ పదవీలో ముత్తిరెడ్డి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా రెండు ఏండ్లు కొనసాగే అవకాశముంది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ కొనసాగిన విషయం తెలిసిందే.ఆయన స్థానంలో తాజాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వీ రవీందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, యాదగిరిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోటీ చేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డిని బరిలో దించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో అసంతృప్తిగా ఉన్న ముత్తిరెడ్డికి TSRTC ఛైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం పడింది.
మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి ని బరిలో దించింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. ఇలాగే.. రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైఎస్ ఛైర్మన్‌గా ఉప్పుల వెంకటేష్ గుప్తా నియమితులయ్యారు.