
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉంది. గురువారం సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, గోపీనాథ్ కార్డియాక్ అరెస్ట్‌కి లోనయ్యారు. అత్యవసరంగా సీపీఆర్ ఇవ్వడంతో గుండె తిరిగి కొట్టడం మొదలైంది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
వైద్యులు సమాచారం ప్రకారం, గోపీనాథ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. తదుపరి 48 గంటల పాటు ఆయన ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుంది. అప్పుడే ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వగలమంటూ వైద్యులు తెలిపారు. గత కొంత కాలంగా ఆయనకు మూత్రపిండ సంబంధిత సమస్యలు ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నెలల క్రితం కూడా డయాలసిస్ కోసం ఆయన ఏఐజీకి చేరినట్టు సమాచారం.
గోపీనాథ్ ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, నామా నాగేశ్వరరావు, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, దాసోజు శ్రవణ్ తదితరులు ఆసుపత్రికి చేరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాగంటి త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని నేతలు కోరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ కూడా గోపీనాథ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో పాటు వైద్య బృందంతో ఫోన్‌లో మాట్లాడారు. గోపీనాథ్‌కు అత్యుత్తమ వైద్యం అందుతోందని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని డాక్టర్లు కేటీఆర్‌కు వివరించారు. అమెరికా పర్యటనను కుదించి కేటీఆర్ హైదరాబాదుకు బయలుదేరినట్టు సమాచారం.