నీకు చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలని.. తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయిని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలని.. తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానని హరీశ్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డను సీఎం రేవంత్ రెడ్డి బాగు చేయలేమని అంటున్నారని మండిపడ్డారు. తాను సీఎంగా బాధ్యతలు తీసుకుని నీళ్లు కూడా ఎత్తిపోస్తానని హరీశ్ రావు పేర్కొన్నారు.
మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయినట్లుగా కాంగ్రెస్ బురద రాజకీయానికి పాల్పడుతోందన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీల సామర్ధ్యం కలిగినటువంటిదన్నారు. వీటన్నింటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని.. ఎమ్మెల్యేలను తీసుకెళ్లినప్పుడు మేడిగడ్డతో పాటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్ పంప్‌హౌస్ , కూడవెల్లితో పాటు పచ్చటి పంట పొలాలను కూడా చూపించాల్సిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయిని అన్నారు.
కాళేశ్వరం ఆయకట్టు 98 వేల ఎకరాలని అబద్ధాలు ఆడుతున్నారని.. ఎగువ మానేరు డ్యామ్ మండు వేసవిలోనూ నిండు కుండలా వుందంటే దానికి కాళేశ్వరమే కారణమన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని.. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బూతద్ధంలో చూపించి తమపై బురద జల్లేందుకే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్ట్‌లు కొట్టుకుపోయిన ఘటనలు వున్నాయని.. నిర్మాణంలో లోపాలుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని.. మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామని ఆయన తెలిపారు.