
కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలో ఉన్నా.. రాష్ట్రానికి చెందిన బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు.. రాష్ట్రానికి నాలుగు పైసలు కూడా తీసుకురాలేదని ప్రణాళిక సంఘం (Planning board) ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉమ్మడి కరీంనగర్ కు గానీ, రాష్ట్రానికి గానీ ఒక్క పైసా తెచ్చిన పాపానా పోలేదని విమర్శించారు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ .. రాష్ట్ర అభివృద్ధి కోసం.. ఎన్ని నిధులు తెచ్చారని బండి సంజయ్ ను ప్రశ్నించారు.
ఉమ్మడి కరీంనగర్ కొత్త రైల్వే లైన్ గానీ, జిల్లాకు కనీసం నవోదయ విద్యాలయాన్ని ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ కు ఎంపీగా ఉన్న సమయంలో తాను వెయ్యి కోట్లు నిధులు తీసుకొచ్చి, స్మార్ట్ సిటీ పనులు చేయించానని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను వినోద్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. బీజేపీలో వందమంది నాయకులు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగితే.. ఇందులో తప్పేమీ ఉందన్నారు.
అదే సమయంలో అదానీ, అంబానీ గురించి మాట్లాడుతూ..ప్రధాని మోడీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేటీఆర్, కవిత, హరీశ్ మొదటి నుంచి పనిచేశారని, వారు ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని అన్నారు. వచ్చేది ఎన్నికల సమయని అక్టోబర్ గాని.. డిసెంబర్‌లో గాని.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)ముందు చూపుతో సాగుతున్నారనీ, ఆయన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తు్న్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేలకు చేరిందని, కార్యకర్తలు, నాయకులందరూ మరింత కష్టపడి.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అభివృద్ధి జరిగిన విషయంపై, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులపై చర్చించుకుంటున్నామని వెల్లడించారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు డ్యామ్ పై నుండి రోడ్డు, రైల్వే బిడ్జి వేయడానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు.