తెలంగాణ హైకోర్టు తీర్పుపై బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయమై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టుగా చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టుగా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చెప్పారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు గురువారం నాడు అనర్హత వేటేసింది. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బండ కృష్ణ మోహన్ రెడ్డి గురువారంనాడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
2014లో తాను చూపించిన ఆస్తులను 2018 ఎన్నికల అఫిడవిట్ లో తాను చూపలేదని తన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారన్నారు. తనపై నాలుగు అభియోగాలు మోపారని బండ కృష్ణమోహన్ రెడ్డి చెప్పారు. 2014లో చూపించిన ఆస్తులను 2018లో విక్రయించినట్టుగా కృష్ణ మోహన్ రెడ్డి వివరించారు.తనపై తప్పుడు కేసులు పెట్టారని కృష్ణ మోహన్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు తీర్పునకు సంబంధించి తనకు పూర్తి సమాచారం రాలేదన్నారు. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు.
కోర్టును కొందరు తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు.ఈ విషయాలను సుప్రీంకోర్టు ముందుస్తామన్నారు.గత ఎన్నికల్లో తనకు 37 వేల మెజారిటీ వచ్చిందన్నారు వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీ విజయం సాధిస్తానని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా బండ కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. 2014 లో ఆయన ఓటమి పాలయ్యారు. 2018లో విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు కృష్ణ మోహన్ రెడ్డి టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరారు. 2018లో మాజీ మంత్రి డీకే అరుణపై కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు బండ కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటేసింది.
also read:గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డికి షాక్: అనర్హత వేటేసిన తెలంగాణ హైకోర్టు
ఈ ఏడాది జూలై మాసంలో తప్పుడు అఫిడవిట్ ఆరోపణలతో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటేసింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావు సవాల్ చేశారు.సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.