ధరణి పోర్టల్ తీసుకొచ్చి బీఆర్ఎస్ పేదల భూములను లాక్కుంది : రేవంత్ రెడ్డి

By Mahesh RajamoniFirst Published Nov 9, 2023, 5:22 AM IST
Highlights

Revanth Reddy: కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత స‌హా ప‌లు ప్రాజెక్టులను కేసీఆర్‌ దెబ్బతీశారనీ, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి గట్టి నిబద్ధతను కలిగివుందని పేర్కొన్నారు.
 

Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బుంటే.. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొజ్జు పటేల్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. డబ్బున్న వారినే అభ్యర్థులుగా బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రకటించాయన్నారు. అయితే, తాము మాత్రం ప్రజాభిమానం ఉన్న వారిని కాంగ్రెస్ తరపున అభ్య‌ర్థులుగా ప్రకటించామ‌ని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి మంచి పోర్టల్ తెస్తామని చెప్పారు. అలాగే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు. బీఆర్ఎస్ ధరణి పోర్టల్ తీసుకొచ్చి పేదల భూములు లాక్కుంద‌ని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులపై భారం మోపిందని అన్నారు.

అలాగే, ధరణి పోర్టల్‌ను ఉపసంహరించుకుని దాని స్థానంలో న్యూ సిస్టమ్‌ను తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభలో టీపీసీసీ అధ్యక్షుడు కేసీఆర్ కుటుంబం ధరణి ముసుగులో హైదరాబాద్‌లో అక్రమంగా భూములు ఆక్రమించిందని, రైతుబంధుపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్ల అమ్మకం అంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు.

ఏ సబ్ స్టేషన్‌లోనైనా 24 గంటల కరెంట్‌ ఉందని నిరూపిస్తే నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై నిరంతర విద్యుత్ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ సవాల్ విసిరారు. అసైన్డ్ భూములపై ​​అన్ని హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారనీ, ఆదివాసీ, లంబాడీ వర్గాలకు కాంగ్రెస్ పంచాయతీలు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందనీ, సమైక్య రాష్ట్రంలో జరిగిన తప్పులను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాననీ, ఇంద్రవెల్లి కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

click me!