ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీలో బీఆర్ఎస్ డ్రామా.. : బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్

Published : Mar 12, 2023, 04:23 PM IST
ప్రజల దృష్టి మరల్చేందుకే ఢిల్లీలో బీఆర్ఎస్ డ్రామా.. : బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్

సారాంశం

Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్  స్పందిస్తూ ఆయ‌న అండ‌గా నిలుస్తూ.. బండి సంజ‌య్ మాట‌ల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.  

BJP state in charge Tarun Chug:  తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మ‌రోసారి భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కుంభ‌కోణం కేసును గురించి ప్ర‌స్తావిస్తూ..  ప్రజల దృష్టి మరల్చేందుకు ఢిల్లీలో బీఆర్ఎస్ డ్రామా మొద‌లుపెట్టింద‌ని విమ‌ర్శించారు.

వివ‌రాల్లోకెళ్తే.. మ‌ద్యం కుంభకోణంలో తమ ఎమ్మెల్సీ  క‌ల్వ‌కుంట్ల కవిత ప్రమేయం ఉందన్న ప్రధాన అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికార పార్టీ దేశ రాజధానిలో  కొత్త డ్రామాకు తెర‌లేపింద‌ని బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. క‌విత‌ను ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌డంతో బీజేపీ పై బీఆర్ఎస్ నాయ‌కులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌రిచ్చారు. చట్టప్రకారం తగిన ప్రక్రియను అనుసరించి, కచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీని ఈడీ విచారణకు పిలిచిందని ఆయన చెప్పారు. అక్రమ లావాదేవీ ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు తెలుసుకునేందుకు ఈడీ కవితకు సమన్లు జారీ చేసిందని, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు చట్టబద్ధమైన సంస్థల పేర్లను ప్ర‌స్తావిస్తూ  బెదిరింపులకు పాల్పడాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుందని ఆయన ఆరోపించారు. 

ఢిల్లీ మ‌ద్యం పాలసీ కుంభ‌కోసం కేసుకు సంబంధించి ఈడీ త‌మ‌ముందు హాజ‌రుకావాల‌ని క‌విత‌ను కోరింది. అయితే, ఈడీ ఎదుట హాజ‌రయ్యే ముందురోజు దేశ రాజ‌ధాని ఢిల్లీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లు గురించి ఒక రోజు నిరాహార దీక్ష‌కు దిగారు. ఈ దీక్షను ప్ర‌స్తావిస్తూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరసన కార్యక్రమం రూపంలో శుక్రవారం ఢిల్లీలో కవిత ప్రదర్శించిన నాటకం ప్రహసనంగా మారిందని త‌రుణ్ చుగ్ విమ‌ర్శించారు. మహిళా రిజర్వేషన్ల గురించి బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. రెండోసారి అధికారంలోకి వచ్చినా టీఆర్ఎస్ కు ఇద్దరు మహిళా మంత్రులు మాత్రమే ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. 

అలాగే, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో కవితకు చిత్తశుద్ధి ఉంటే తన తండ్రి మంత్రివర్గంలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మౌనంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. సౌత్ గ్రూప్ లో ఉన్నారా లేదా అనే సాధారణ ప్రశ్నలకు కవిత వద్దగానీ, ఆమె కుటుంబ సభ్యుల వద్దగానీ సమాధానాలు లేవని అన్నారు. మద్యం పాలసీని నిర్ణయించే చర్చల్లో ఆమె పాల్గొన్నారా? అని ప్ర‌శ్నించారు.

ఇదిలావుండ‌గా, క‌విత‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌పై బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్  స్పందిస్తూ ఆయ‌న అండ‌గా నిలుస్తూ.. బండి సంజ‌య్ మాట‌ల‌ను వ‌క్రీక‌రించి ప్ర‌చారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.  ఈ విష‌యంలో క‌విత నిజాలు చెప్పాల‌ని అన్నారు. దర్యాప్తు సంస్థలకు సోనియాఅయినా, కేసీఆర్ అయినా ఒకటేనంటూ వ్యాఖ్యానించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్