''కేసీఆర్ గారు... మీరు మారిపోయారండీ'' : బిఆర్ఎస్ బాస్ తీరుపై ప్రజల అభిప్రాయమిదేనా..!

By Arun Kumar PFirst Published Apr 27, 2024, 7:05 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో చేరారు. తాజాగా కేసీఆర్ వ్యక్తిగతంగా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ తెరిచారు. 

హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారాన్ని, సీఎం పదవిని కోల్పోయిన తర్వాత అనారోగ్య కారణాలతో ఇంటికే పరిమితమైన ఆయన ఇటీవలే మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తన శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా పదేళ్లుగా ఎన్నడూ చూడని కేసీఆర్ ను ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు.  ప్రజలకు చేరువయ్యేందుకు కేసీఆర్ ప్రయత్నాలను చూస్తున్న నెటిజన్లు 'ఈయన ఇంతలా మారిపోయాడేంటి' అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునుండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా వున్నారు. తన పదవీకాలంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంకు వెళ్లిన సందర్భాలే చాలా అరుదు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లేదంటే ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ నుండి పాలన సాగించేవారు. ప్రజలతోనూ ఎక్కువగా కలిసి సందర్బాలు లేవు. పార్టీ కార్యక్రమాలు, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు, ఏదయినా ఎన్నికలుంటే ప్రచార సభల్లో మాత్రమే కేసీఆర్ కనిపించేవారు.  దీంతో ఆయనకు అధికార గర్వం తలకెక్కిందని ఆరోపించడంతో పాటు దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ వ్యవహారించిన తీరు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి ఓ కారణమన్న వాదన వుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. 

ఇప్పటికే బస్సు యాత్ర ద్వారా ప్రజలవద్దకు వెళుతున్నారు కేసీఆర్. అంతకంటే ముందే గత పదేళ్లు ఏనాడూ టివిలకు ఇంటర్వ్యూ ఇవ్వని కేసీఆర్  తాజాగా ఓ తెలుగు టివీ ఛానల్ కార్యాలయానికి వెళ్లిమరీ ఇంటర్వ్యూ ఇచ్చారు. 12 ఏళ్ల తర్వాత ఆయన ఓ టివీ ఛానల్ కు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది చాలు కేసీఆర్ తీరులో మార్పు వచ్చిందని చెప్పడానికి. తాజాగా ప్రజలకు మరీ ముఖ్యంగా యువతను దగ్గరయ్యేందుకు బిఆర్ఎస్ అధినేత ప్రయత్నాలు ప్రారంభించారు. 

తాజాగా కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసారు. ఇంతకాలం ఆయనకు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ లేవు... ఇప్పుడు వాటి అవసరం ఆయనకు పడింది. తమ భావాలను వ్యక్తం చేయడానికే కాదు రాజకీయంగానూ సోషల్ మీడియా ఎంత ఉపయోగకరమో ఇప్పటికి గుర్తించినట్లున్నారు కేసీఆర్. ఇప్పటికే ఆయన తనయుడు కేటీఆర్ విరివిగా సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ తెరిచి వాటిద్వారా కూడా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 

బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! pic.twitter.com/X1FxmEugmN

— KCR (@KCRBRSPresident)

 

ఎక్స్ ఖాతా తెరవగానే కాంగ్రెస్ పాలనపై సెటైర్లు వేసారు కేసీఆర్. ''తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారు. నాతోపాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి. జై తెలంగాణ'' అంటూ కేసీఆర్ ట్వీట్ చేసారు. 

click me!