మహిళా అభ్యర్థులే కరువయ్యారా ? ప్రధాన పార్టీల నుంచి ఆరుగురే బరిలో..

By Rajesh Karampoori  |  First Published Apr 27, 2024, 1:20 PM IST

తెలంగాణలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం 6 గురు మహిళా అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. మహిళా సాధికారత అంటూ నినాదాలు ఇచ్చే పార్టీలు.. ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రమే వివక్షనే చూపుతున్నాయి. 
 


ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల పండగ జరుగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలో మహిళలకు అరకొరగానే సీట్లు కేటాయించాయి. అనేక రంగాల్లో మహిళల ప్రధాన్యత పెరుగుతున్నా.. ఇంకా రాజకీయ రంగంలో వారు వెనకబడే ఉన్నారు. మహిళలకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రధాన పార్టీలు కూడా.. టికెట్ల కేటాయింపుల సమయంలో వివక్షనే చూపిస్తున్నాయి.

తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ మూడు పార్టీలు తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో బరిలో నిలిచాయి. వాస్తవానికి ఈ మూడు పార్టీల నుంచి సుమారు 51 మంది మహిళలు టికెట్లు ఆశించారు. కానీ టికెట్ల కేటాయింపుల సమయంలో వారికి అన్యాయమే జరిగిందని చెప్పవచ్చు. 

Latest Videos

undefined

టికెట్లు ఆశించిన మహిళల్లో 88 శాతం మందికి మాత్రమే పార్టీలు నిరాశే మిగిలిచ్చాయి. కేవలం 12 శాతం మందికే టికెట్లు కేటాయించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి, బీజేపీ ఇద్దరికి, బీఆర్ఎస్ ఒకరికి మాత్రమే టికెట్ కేటాయించింది. ప్రధానమైన ఈ మూడు పార్టీలే మహిళలకు మొండి చేయి చూపిస్తే.. ఇక మిగితా పార్టీల గురించి చెప్పక్కర్లేదు. చిన్న చిన్న పార్టీలు కూడా మహిళలకు టికెట్ల కేటాయింపులో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. 

ఇక టికెట్లు పొంది, బరిలో నిలిచిన వారిలో బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత, డీకే అరుణ ఉన్నారు. వీరిలో ఒకరు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే, మరొకరు ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీకి పోటీగా హైదరాబాద్ లోక్ సభ బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరుఫున ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు. వరంగల్ లోక్ సభ స్థానం నుంచి తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు, కడియం కావ్య బరిలో నిలిచారు. మల్కాజ్ గిరి నుంచి పట్నుం సునీత పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున మహబూమాబాద్ నుంచి మాలోత్ కవిత బరిలో నిలిచారు. ఇక మిగిలిన స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి పురుషులే బరిలో ఉన్నారు.

అయితే గత లోక్ సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. 2019లో మూడు ప్రధాన పార్టీల నుంచి 25 మంది బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో 12 మంది మహిళలు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత మాత్రమే పోటీ చేశారు. ఆమె నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. మహిళలకు రాజకీయ రంగంలో ప్రధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసే పార్టీలే ఎన్నికల టికెట్ల కేటాయింపు సమయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయని ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.

click me!