తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. దీంతో ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేయగా తాజాగా మరో ఇంటిని కూడా ఖాళీ చేసేందుకు సిద్దమయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. భారీ మెజారిటీ కాకున్నా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు సరిపడా సీట్లయినా వస్తాయని ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ఇతర నాయకులు భావించారు.కానీ కాంగ్రెస్ పార్టీ హవా ముందు కారు నిలవలేపోయింది... 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్వయంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడిపోయారు... గజ్వెల్ లో మెజారిటీ తగ్గినా గెలవడంతో పరువు నిలిచింది.
అయితే బిఆర్ఎస్ పార్టీ ఓటమితో ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు కేసీఆర్. దీంతో ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ నూతన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేవరకు ఆపద్దర్మ ప్రభుత్వాన్ని నడపాలని కోరారు. కాబట్టి వెంటనే వెంటనే అధికారిక నివాసం ప్రగతిభవన్ ను వీడాల్సిన అవసరం లేదు... కానీ మాజీ ముఖ్యమంత్రిగా అధికారిక భవనంలో వుండలేక ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు కేసీఆర్. తన సెక్యూరిటీని, కాన్వాయ్ ని వదిలి సామాన్యుడిలా ప్రగతి భవన్ ను వీడాడు కేసీఆర్.
undefined
ఇక దేశ రాజధాని న్యూడిల్లీలోని 23 తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసాన్ని కూడా కేసీఆర్ ఖాళీ చేయడానికి సిద్దమయ్యారు. 2004 నుండి ఇప్పటివరకు డిల్లీ వెళ్లినప్పుడల్లా ఇదే ఇంట్లో వుండేవారు కేసీఆర్. ఎంపీగా వుండగా ఈ ఇంటిని కేంద్రం కేటాయించింది. 2014 లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ ఇదే ఇంటిని అధికారిక నివాసంగా కొనసాగించారు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన కేసీఆర్ ఇరవైఏళ్ళ అనుబంధం కలిగిన ఇంటిని కూడా వదిలివెళ్లాల్సి వస్తోంది.
Also Read K Chandrashekar Rao : ప్రగతిభవన్ వీడిన కేసీఆర్... సొంతకారులో సామాన్యుడిలా ఫామ్ హౌస్ కి
ఇదిలావుంటే ఇప్పటికే మంత్రులు, ఓడిన ఎమ్మెల్యేలు కూడా అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ప్రగతి భవన్ వుంటుందో లేదో తేలనుంది. ఇప్పటికే ప్రగతిభవన్ ను అంబేద్కర్ భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులోకి సామాన్యుడికి కూడా ఎంట్రీ వుంటుందని తెలిపారు. ఈ మాటలను బట్టిచూస్తే ప్రగతి భవన్ ను సీఎం అధికారిక నివాసంగా కొనసాగించడం అనుమానంగానే కనిపిస్తోంది.