అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి.వరంగల్ నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా కడియం కావ్య ప్రకటించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. మరో వైపు వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా కడియం కావ్య ప్రకటించారు. ఇటీవలనే బీఆర్ఎస్ అభ్యర్ధిగా కడియం కావ్య పేరును కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని కడియం కావ్య బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఈ నెల 28న లేఖ పంపారు.
వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను పక్కన పెట్టి కడియం శ్రీహరి కూతురు కావ్యకు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే ఈ తరుణంలో కడియం కావ్య కూడ పోటీ నుండి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ పరిణామం చర్చకు దారి తీసింది. కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతుంది. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురే కడియంకావ్య.
వరంగల్ ఎంపీ స్థానంలో తనను అభ్యర్ధిగా ఎంపిక చేయడంపై కేసీఆర్ ను కలిసి కావ్య ధన్యవాదాలు తెలిపారు. మూడు రోజులకే కావ్య వరంగల్ ఎంపీ స్థానం నుండి పోటీ చేయలేనని కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ విషయమై వరంగల్ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ తొలుత ఖరారు చేసింది. అయితే బీఆర్ఎస్ టిక్కెట్టుపై పోటీకి రంజిత్ రెడ్డి విముఖత చూపారు.దరిమిలా చేవేళ్ల నుండి కాసాని జ్ఞానేశ్వర్ కు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. ఇదిలా ఉంటే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా రంజిత్ రెడ్డి చేవేళ్ల పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. మరో వైపు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణికి తొలుత చేవేళ్ల ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది.రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్టును కేటాయించింది.