యూనివర్సిటీలో గడ్డిమేసిన గేదెలు.. సోదరుడిపై కొడవలితో దాడి.. !!

By AN TeluguFirst Published Mar 26, 2021, 11:45 AM IST
Highlights

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గేదెలు గడ్డిమేసిన వివాదం.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారి తీసి.. హత్యాయత్నానికి కారణమయ్యింది. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో గేదెలు గడ్డిమేసిన వివాదం.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవకు దారి తీసి.. హత్యాయత్నానికి కారణమయ్యింది. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఏసీపీ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎం. బాల్ రాజ్ అలియాస్ బాలయ్యం (38), ఎం. రమేష్ (37) వరుసకు సోదరులవుతారు. 

రమేష్ కు చెందిన 3 గేదెలు బుధవారం రాత్రి వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేశాయి. ఈ విషయాన్ని బాలయ్య వర్సిటీ అధికారులకు తెలిపాడు. దీంతో రమేష్ కు అధికారులు జరిమానా విధించారు. ఇదేవిషయం మీద గురువారం ఎన్ఐఆర్డీ కమాన్ దగ్గర బాలయ్య, రమేష్ మధ్య గొడవ జరిగింది. 

ఈ గొడవలో మాటా,మాటా పెరిగి ఒకరిమీద ఒకరు దాడికి దిగారు. బాల్ రాజ్ తన వెంట తెచ్చుకున్న కొడవలితో రమేష్ పై దాడి చేశాడు. స్థానికులు బాల్ రాజ్ ను నియంత్రించి కొడవలిని లాగేయడంతో ప్రమాదం తప్పింది. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాల్‌రాజ్‌.. రమేష్‌పై దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రాజేంద్రనగర్‌కు చెందిన నారాయణ, నరేష్‌ ధైర్యంగా ముందుకు వెళ్లి బాలరాజ్ ను అడ్డుకుని, రమేష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ వారిని అభినందించారు. 

కాగా బాల్ రాజ్ మీద గతంలో కూడా రెండు హత్యారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో బాల్ రాజ్ నిత్యం మద్యం తాగి దౌర్జన్యం చేస్తుండేవాడని, దాడులకు పాల్పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. సోదరుడిపై దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

click me!