
హైదరాబాద్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్‌లోని (MGBS) 44వ ప్లాట్‌ఫామ్ వద్ద మూడేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించారు. వివరాలు.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం రంగనాయకులు కాలనీకి చెందిన లక్ష్మణ్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం భార్య, కూతురితో కలిసి ఏపీలోని అన్నమయ్య జిల్లాకు వెళ్లాడు. అయితే కొడుకు నవీన్‌ను హైదరాబాద్‌లోనే బంధువుల ఇంట్లో ఉంచాడు. ఇటీవల కొడుకును తీసుకెళ్లేందుకు బంధువుల ఇంటికి వచ్చాడు.
ఇక, కొడుకుతో కలిసి అన్నమయ్య జిల్లాకు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. అయితే తండ్రి మూత్రశాలకు వెళ్లివచ్చేలోపు బాలుడు కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించకుండా పోవడంతో తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇక, బాలుడిని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తిరుపతిలో బాలుడి కిడ్నాప్ తీవ్ర కలకం సృష్టించిన సంగతి తెలిసిందే. తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న బాలుడి తండ్రి హోటల్‌లో పనిచేస్తుండగా, తల్లి స్వాతి శ్రీవారి ఆలయానికి సమీపంలో భక్తుల నుదుటి గోవింద నామాలు పెడుతూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం స్వాతి తన పనిలో నిమగ్నమై ఉండగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం సమీపంలో ఉన్న బాలుడి వద్దకు ఓ మహిళ వచ్చి అతనితో కాసేపు గడిపింది. ఆమె అతనికి కొన్ని స్వీట్లు అందించింది. సాయంత్రం 5.15 గంటలకు బాలుడిని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది.
సాయంత్రం 5.45 గంటలకు కొడుకు కనిపించడంతో స్వాతి గుడి చుట్టుపక్కల వెతికింది. అతడి ఆచూకీ లభించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నీలిరంగు చొక్కా, లేత గోధుమరంగు ప్యాంటు ధరించి ఉన్న బాలుడిని.. పింక్ చూడీదార్ ధరించిన మహిళ తీసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించారు. ఆదివారం రాత్రి 7.20 గంటలకు మహిళ బాలుడితో కలిసి బస్సులో తిరుపతికి వెళ్లినట్టుగా పోలీసులు కనుగొన్నారు.
తిరుపతిలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా మహిళ రాత్రి 8.10 గంటల ప్రాంతంలో బాలుడిని గోవిందరాజ స్వామి ఆలయానికి, అక్కడి నుంచి 8.50 గంటలకు విష్ణు నివాసం యాత్రికుల సౌకర్యాల సముదాయానికి తీసుకెళ్లినట్లు గుర్తించామని తిరుమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే చంద్రశేఖర్ తెలిపారు. ఆ తర్వాత సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆమె రైల్వే స్టేషన్‌లో కనిపించింది. అక్కడ ట్రైన్ టికెట్ కొనుగోలు చేసి.. ప్లాట్‌ఫామ్ నెంబర్ 2, 4లలో తిరుగుతూ కనిపించింది. చివరిగా ఆమె సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కనిపించింది. ఆ తర్వాత ఆమె కదలికలను పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే ఆ సమయంలో బయలుదేరిన రైళ్ల వివరాల ఆధారంగా పలు ప్రాంతాలకు బృందాలను పంపి గాలింపు చేపట్టారు.
అయితే బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ మైసూర్‌కు తీసుకెళ్లింది. అయితే మహిళ తల్లిదండ్రులు బాలుడిని ఎందుకు తీసుకొచ్చావని ప్రశ్నించారు. అనంతరం తిరుమలకు వచ్చి టీటీడీ విజిలెన్స్ పోలీసులకు బాలుడిని అప్పగించారు. అనంతరం అధికారులు బాలుడిని అతడి తల్లికి అప్పజెప్పడంతో కథ సుఖాంతం అయింది.