హుజురాబాద్ లో ఓటుకు ముప్పై వేలు... అది గుర్తు పెట్టుకుని ఓటేయండి: హరీష్ సంచలనం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 16, 2021, 1:01 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఏం చేసయినా గెలవాలని భావిస్తున్న బిజెపి ఓటుకు ముప్పయి వేల వరకు ఇవ్వడానికి సిద్దపడిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే అరసార్లు గెలిపించి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు... ఇప్పుడు ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం ఇవ్వండి అని హుజురాబాద్ ప్రజలను ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరారు. గత పదిహేడేళ్లలో జరగని అభివృద్ది ఈ రెండేళ్లలో చేసి చూపెడుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలో లేదు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేదని ప్రజలుగుర్తించాలన్నారు. బిజెపి ఒక్క ఓటుకు ముప్పయి వేలు ఇస్తారట... ఇలా డబ్బులు ఇచ్చినా మనం మోసపోవద్దు అని హరీష్ సూచించారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం బోర్లపల్లిలో విశ్వబ్రహ్మణ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి  తన్నీరు హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇవాళ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ... ఒకేరోజు ఒకే నియోజకవర్గంలో రెండు ఫంక్షన్ హాల్ లకు  శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమన్నారు.  

''రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు దండగ అని మాజీ మంత్రి ఈటల అంటున్నారు. ఇలా సంక్షేమ పథకాలు దండుగ అన్నోల్లకు ఓటు వేద్దామా... సంక్షేమ పథకాలు అమలు చేసే వాళ్లకు ఓటు వేద్దామా ఆలోచించండి'' అని ప్రజలకు సూచించారు.

read more  నేను రాను బిడ్డో కాదు... నేను వస్త బిడ్డో తెలంగాణ సర్కార్ దవాఖానకు: మంత్రి హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు

''బిజెపి ప్రభుత్వానికి సామాజిక న్యాయం గురుంచి మాట్లాడే అర్హత లేదు. రాష్ట్ర అసెంబ్లీలో బిసిల రిజర్వేషన్ల కోసం తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్రంలో బిసి శాఖ ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి కేసీఅర్ కోరితే ఇప్పటికీ చేయడం లేదు'' అని మండిపడ్డారు. 

వీడియో

''ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పెరుగుతున్న సిలిండర్ ధరను గుర్తు చేసుకొని ఓటు వేయండి. బిజెపి ధరలు పెంచడమే కాదు ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి ఉద్యోగాలను తొలగిస్తుంది. ఇలాంటి బిజెపికి ఎందుకు ఓటు వేయాల్నో ఆలోచించండి'' అని సూచించారు. 

''ప్రపంచీకరణతో విశ్వకర్మలకు నష్టం జరుగుతుంది. ఇంకా రెండున్నరేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో, కేసీఅర్ సీఎంగా ఉంటారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి అండగా ఉండండి. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపుతోనే అభివృద్ది సాధ్యం అవుతుంది'' అన్నారు. 

''విశ్వకర్మలకు భవిష్యత్తులో ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించుకుందాం. హుజురాబాద్ కు నాలుగు వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తే ఒక్కరికీ కూడా ఇప్పటివరకు ఇల్లు దక్కలేదు. బిజెపి నాయకులు ఓటుకు డబ్బులు ఇచ్చే బదులు పెంచిన ధరలు తగ్గించి ఓటు అడగాలి'' అని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు.

  

click me!