అరెస్ట్ చేస్తారని కవితకు భయం పట్టుకుంది: ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ సంచలనం

By narsimha lode  |  First Published Dec 5, 2022, 3:42 PM IST

సీబీఐ విచారణకు  వెళ్లకుండా  టీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత  స్కెచ్  వేస్తున్నారని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  చెప్పారు. తనకు సంబంధం లేకపోతే  కవిత  విచారణకు హాజరు కావాలని ఆయన  సూచించారు. 
 


నిర్మల్:  సీబీఐ విచారణకు వెళ్తే అరెస్ట్  చేస్తారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భయం పట్టుకుందని  బీజేపీ  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  చెప్పారు.నిర్మల్  జిల్లాలోని  కనకాపూర్  లో ఐదో విడత  ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర సందర్భంగా  నిర్వహించిన సభలో  బండి  సంజయ్ ప్రసంగించారు.  సీబీఐ విచారణకు హాజరుకాకుండా  ఉండేందుకు  కవిత  స్కెచ్  వేస్తున్నారని  ఆయన  ఆరోపించారు.విచారణకు ఎందుకు పోతానని  కవిత  అంటే ఊరుకోరన్నారు. తనకు సంబంధం  లేకపోతే కవిత విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ సూచించారు.

37 మంది  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి  ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆరేనని  బండి  సంజయ్  గుర్తు  చేశారు. కేసీఆర్  చేస్తే  సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా  అని  బండి  సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు. అలాంటిది  ప్రభుత్వాన్ని ఎలా  కూలుస్తామని  బండి సంజయ్ ప్రశ్నించారు.  కేసీఆర్ కు వ్యతిరేకంగా  57 మంది  టీఆర్ఎస్  ఎమ్మెల్యేలున్నారని  బండి సంజయ్  చెప్పారు. అందుకే కేసీఆర్ భయపడుతున్నారని  బండి సంజయ్ చెప్పారు.  

Latest Videos

బెంగుళూరు డ్రగ్స్  కేసును మళ్లీ తెరిపిస్తామని  బండి  సంజయ్  తెలిపారు. హైద్రాబాద్ , బెంగుళూరు డ్రగ్స్  కేసును  బయటకు తీస్తామని  బండి  సంజయ్  తెలిపారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి  సంజయ్  అనుమానం వ్యక్తం  చేశారు. 

ఈ నెల  2వ తేదీన సీబీఐ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవితకు 140 సీఆర్పీసీ సెక్షన్ కింద  నోటీసులు జారీ చేశారు. ఈ  నెల 6న  విచారణకు  ఢిల్లీ లేదా హైద్రాబాద్ లలో  విచారణకు స్థలం ఎంపిక చేసుకోవాలని ఆ నోటీసులో  కోరారు. ఢిల్లీ లిక్కర్  స్కాంకు సంబంధించి  సీబీఐ అధికారులు సమాచారం  కోసం  ఈ  నోటీసులు పంపారు.

also read:డిసెంబర్ 6వ తేదీన కలవలేను.. : సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ..

అయితే ఈ నోటీసులకు సంబంధించి సీబీఐ అధికారులకు ఈ  నెల  3న కవిత  లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్  స్కాం ఎఫ్ఐఆర్ ను పంపాలని  ఆ లేఖలో  కోరింది. అయితే సీబీఐ వెబ్  సైట్ లో  దీనికి  సంబంధించిన వివరాలున్నాయని పరిశీలించాలని సీబీఐ అధికారులు కవితకు సమాచారం పంపారు.వీటిని పరిశీలించిన  తర్వాత  కవిత  ఇవాళ  మరోసారి  సీబీఐ అధికారులకు లేఖ రాశారు.ఈ నెల 6న విచారణకు తనకు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజున విచారణకు రావాలని ఆ లేఖలో  సీబీఐని కోరింది కవిత.సీబీఐ విచారణకు వచ్చే వారం రావాలని కవిత కోరడంపై  బండి  సంజయ్  ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో  సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.  ఈ కేసులో  ఇప్పటికే  ఆరుగురిని ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు.డిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఆప్ తోపాటు టీఆర్ఎస్  పై బీజేపీ నేతలు గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

click me!