కేటీఆర్ ను ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టారని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ ఇవాళ లేఖ రాశారు.
కరీంనగర్: కేటీఆర్ ను ప్రశ్నించినందుకే తనపై టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసు న మోదు చేశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను బండి సంజయ్ గురువారంనాడు లేఖ రాశారు. జైలు నుండి బండి సంజయ్ బీజేపీ కార్యకర్తలకు లేఖ రాశారు. బీజేపీ 44వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాశారు. బీజేపీ నాలుగు దశాబ్దాల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనట్టుగా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీకేజీ కేసులో అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులకు భయపడేది లేదన్నారు. జైళ్లు, కేసులు తనకు కొత్త కాదని బండి సంజయ్ చెప్పారు.
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అంశంలో కుట్ర జరిగిందని పోలీసులు ప్రకటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఈ కేసులో ఏ1 నిందితుగా వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. ఈ కేసులో అరెస్టైన బండి సంజయ్ కు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఈ నెల 3వ తేదీనే బండి సంజయ్, ప్రశాంత్ మధ్య ఈ విషయమై మాట్లాడుకున్నారని పోలీసులు ప్రకటించారు.
టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ అంశానికి సంబంధించి కూడా బీజేపీ నేతల కుట్ర ఉందని కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది.