తెలంగాణలో రాజ్యాంగానికి విరుద్దంగా పాలన సాగుతుందని బీజేపీ ఆరోపించింది. రిపబ్లిక్ డే వేడుకల విషయమై కోర్టులు ఆదేశాలు ఇచ్చినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు.
హైదరాబాద్: రాజ్యాంగానికి విరుద్దంగా తెలంగాణలో పాలన సాగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.గురువారం నాడు హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.కోర్టులు, మహిళలంలటే సీఎం కేసీఆర్ కు గౌరవం లేదన్నారు. రాజ్యాంగం స్పూర్తితో భారత్ శక్తివంతంగా తయారౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం , గవర్నర్ పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని, రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్ కు దేశంలో ఉడే హక్కు లేదని ఆయన చెప్పారు. దేశాన్ని అసహ్యించుకొని పక్కదేశాలకు వంతపాడే వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఇవాళ దళిత, గిరిజన, అణగారిన వర్గాలకు సైతం ఓటు హక్కు వచ్చిందంటే అది అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంవల్లే సాధ్యమైందన్నారు. తాను ప్రధాని అయ్యానంటే అంబేద్కర్ పెట్టిన భిక్షేనని చెప్పారని మోడీ చేసి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ స్పూర్తితోనే మోదీ భారత్ ను ప్రపంచంలోనే నెంబర్ వన్ శక్తిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
గతంలో గవర్నర్లకు సాష్టాంగ నమస్కారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ .....ఉన్నత చదువు చదివిన మహిళా గవర్నర్ ను మాత్రం అవమానిస్తున్నారన్నారు. చివరకు కోర్టు తీర్పులను, కేంద్ర గైడ్ లైన్స్ ను కూడా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని చెప్పారు. తెలంగాణలో . కల్వకుంట్ల రాజ్యంగాన్ని కేసీఆర్ అమలు చేయాలనుకుంటున్నాడన్నారు. తనకు తానే నియంత అనుకుంటున్నాడని బండి సంజయ్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. హిట్లర్ లాంటి వ్యక్తినే కాలగర్భంలో కలిసిన చరిత్రను గుర్తుంచుకోవాలని ఆయన కేసీఆర్ ను కోరారు.