నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి ఘటనపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ మండిపడ్డారు. ఫాంహౌస్ ఘటన కేసీఆర్ డ్రామాగా ఆయన పేర్కొన్నారు. షామీర్ పేటలో బీజేపీ శిక్షణ తరగతుల్లో తరుణ్ చుగ్ పాల్గొన్నారు.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడి దుర్మార్గమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు.ఆదివారంనాడు షామీర్ పేటలో నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, అహింసా మార్గంలోనే కేసీఆర్ ను ఎదుర్కొంటామని తురుణ్ చుగ్ చెప్పారు.మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ కేసీఆర్ డ్రామాగా ఆయన పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసుకొనేందుకుగాను ఈ మూడు రోజుల శిక్షణ తరగతులు దోహదం చేస్తాయని తరుణ్ చుగ్ చెప్పారు.
రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు అరవింద్ ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అరవింద్ నివాసంలోని కారుపై కూడా దాడి చేశారు.
ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడి జరిగిన సమయంలో ధర్మపురి అరవింద్ ఇంట్లో లేరు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కవిత ఫోన్ చేశారని , కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఎఐసీసీ జనరల్ సెక్రటరీ తనకు ఫోన్ చేసి చెప్పారని అరవింద్ మూడు రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. .ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు.
కాంగ్రెస్ లో చేరేందుకు గాను తాను మల్లికార్జున ఖర్గేతో మాట్లాడినట్టుగా ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేయడంపై కవిత మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే నిజామాబాద్ లో చెప్పుతో కొడుతానని ధర్మపురి అరవింద్ కి కవిత వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో కూడా కేసీఆర్ ఇదే తరహ వ్యాఖ్యలు చేశారు. కవితను కూడ పార్టీలో చేరాలని బీజేపీ సంప్రదింపులు చేసిందన్నారు. ఈ వ్యాఖ్యలను కవిత కూడా వాస్తవమేనని చెప్పారు.
అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, కవిత విమర్శలపై ధర్మపురి అరవింద్ స్పందించారు. తనపై దమ్ముంటే పోటీ చేయాలని అరవింద్ కవితకు సవాల్ విసిరారు. తన ఇంటిపై దాడి చేయడమే కాకుండా తన తల్లితోపాటు ఇంట్లో ఉన్న మహిళలను బెదిరించారని అరవింద్ ఆరోపించారు.