ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించి ఆడియో, వీడియో సంభాషణలు ఉంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
యాదగిరిగుట్ట: ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాల అంశానికి సంబంధించి ఆడియో, వీడియోలు ఉంటే కోర్టుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి తమకు సంబందం లేదని యాదాద్రి ఆలయంలో బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. అనంతరం ఆయన యాదాద్రిలో మీడియాతో మాట్లాడారు.కోర్టుకు ఆధారాలు సమర్పిస్తే నిందితులు జైల్లో ఉండేవారు కదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ ఆడియోలు తయారు చేయడానికి కేసీఆర్ కు రెండు రోజులు పట్టిందని బండి సంజయ్ విమర్శించారు.ఈ ఆడియోలన్నీ ఫేక్ ఆడియోలేనని చెప్పారు.
లైడిటెక్టర్ టెస్టుకు కేసీఆర్ కుటుంబం,నలుగురు ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.స్వంత పార్టీ ఎమ్మెల్యేలను,నాయకులను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు.పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ లోనే ఇదంతా జరిగిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేశారనే ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. గన్ మెన్లను వదిలి ఎమ్మెల్యేలు ఫాం హౌస్ కు ఎందుకు వెళ్లారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఫాంహౌస్ లో ఉన్నకార్లలో డబ్బులున్నాయనే ప్రచారం జరిగిందన్నారు. అయితే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు.ఎమ్మెల్యేలు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదో చెప్పాలన్నారు. చిన్న చిన్న అంశాలకే హంగామా చేసే పోలీసులు ,ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు ఎమ్మెల్యేలను దాచిపెడుతుందో చెప్పాలన్నారు.
also read: ఎవరెవరికి ఎంతివ్వాలి: రామచంద్రభారతి, నందకుమార్ ,సింహయాజీల ఫోన్ సంభాషణ
ప్రగతిభవన్ , దక్కన్ కిచెన్ హోటల్ ,ఫాంహౌస్ సిసీటీవీ పుటేజీని బయటపెట్టాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యేల మొబైల్ కాల్ డేటాను బయటపెట్టాలని ఆయన కోరారు.మునుగోడులో ఓటమి పాలుకానుందనే భయంతో కేసీఆర్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు అనే డ్రామాకు తెర తీశారన్నారు. దుబ్బాక,హుజూరాబాద్ లో వచ్చిన ఫలితాలే మునుగోడులో రానున్నాయన్నారు.ఎమ్మెల్యేలతో మాట్లాడినట్టుగా చెబుతున్న రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లకు బీజేపీతో ఏం సంబంధం ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీలో వాళ్లకు సభ్యత్వం ఉందా అని ఆయన అడిగారు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు ఐటం సాంగ్ పెట్టినట్టుగా ఫాం హౌస్ ఎపిసోడ్ ఉందని ఆయన సెటైర్లు వేశారు.