తెలంగాణ ఎన్నిక ప్రచారంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పర్యటించనున్నారు. అలాగే.. జనసేన- బీజేపీ పొత్తుపై కూడా క్లారిటీ రానున్నది.
తెలంగాణ ఎన్నిక ప్రచారంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఈ నెల 27న రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు సూర్యాపేట లో నిర్వహించనున్న ఎన్నికల భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధిష్టానం దాదాపు లక్ష మంది వచ్చేలా సన్నహాకాలు చేస్తోంది. అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించ నున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28 లేదా 29 తేదీల్లో అస్సోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ, 31 యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముంది.
అసమ్మతి నేతల బుజ్బగింపులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 52 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. మరో ఒకటి రెండు రోజుల్లో రెండో జాబితాను కూడా విడుదల చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. అయితే తొలి జాబితా విడుదల తరువాత ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు, అసంతృప్తి సెగలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తమకు ప్రాధ్యానత ఇవ్వడం లేదని కొందరూ.. టికెట్ దక్కలేదని మరికొందరు..టికెట్ ఇచ్చినా.. కోరిన చోట ఇవ్వలేదని మరికొందరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సూర్యాపేట సభ అనంతరం అమిత్ షా వారితో బేటీ కానున్నట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలో నచ్చజెప్పడంతో పాటూ వారికి భవిష్యత్ పై భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు.. పలువురు బీజేపీ సీనియర్ నేత దఫాల వారికి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీగా సాగుతుండగా.. మధ్యలో దూరడం అవసరమా..? అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పొత్తుపై క్లారిటీ..
ఇదిలా ఉంటే..అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన- బీజేపీ పొత్తులపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఇప్పటికే తమకు 20కి పైగా సీట్లు కేటాయించాలని తెలంగాణ జనసేన పార్టీ కోరుతుండగా.. 8 లేదా 10 సీట్లు మాత్రమే ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నట్లు సమాచారం. మొత్తానికి అమిత్ షా- పవన్ ల భేటీ తర్వాతే ఇరు పార్టీల పొత్తులపై ఓ క్లారిటీ రానున్నది. ఏపీలో పొత్తుల అంశంపై కూడా చర్చిస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు.