
భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి శనివారం ఉదయం మృతి చెందారు. వృద్యాప్యం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలతో కొంత కాలం నుంచి ఆయన బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.
జంగారెడ్డి హన్మకొండలో జన్మించారు. బీజేపీలో సుదీర్ఘకాలం పాటు పని చేస్తు వస్తున్నారు. పలు సార్లు పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన దివంగత నేత పీవీ నరసింహరావును కూడా జంగారెడ్డి ఓడించారు. తన ప్రత్యర్థిపై 54 వేల ఓట్ల మెజారిటితో గెలుపొందిన ఘనత ఆయనకు ఉంది. 1984 సంవత్సరంలో బీజేపీకి ఉన్న ఇద్దరు ఎంపీలో ఈయన ఒకరు. బీజేపీకి కురువృద్దుడిగా ఉన్న ఆయన మృతి చెందడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది. జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.
జంగారెడ్డి మృతదేహాన్ని ముందుగా నాంపల్లి బీజేపీ ఆఫీసులో కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. అక్కడ నివాళి అర్పించిన తరువాత పరకాల తీసుకెళ్లనున్నారు. అక్కడే జంగారెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.