తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 52 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల జాబితా పలుచోట్ల పార్టీలో చిచ్చు రాజేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 52 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థుల జాబితా పలుచోట్ల పార్టీలో చిచ్చు రాజేసింది. జాబితాలో చోటు లభించకపోవడంతో టికెట్ ఆశించిన కొందరు నేతలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నేతలు అయితే రాజీనామాలకు సైతం వెనకాడటం లేదు. ఈ జాబితాలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి కూడా ఉన్నారు. ముథోల్ టికెట్ రమాదేవి ఆశించగా.. ఆ స్థానంలో పార్టీ అభ్యర్థిగా రామారావు పటేల్‌ను బీజేపీ ప్రకటించింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమాదేవి.. కన్నతల్లి లాంటి బీజేపీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేశానని చెప్పారు. జిల్లాలో పార్టీ విస్తరణ కోసం శ్రమించానని తెలిపారు. తాను పార్టీ కోసం తిరిగిన సమయంలో చూసి నవ్విన వాళ్లకు టికెట్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దున్ని, విత్తనం వేస్తే.. పంట చేతికొచ్చిన తర్వాత పంట తీసుకపోతుంటే బాధ కలగదా? అంటూ బోరున విలపించారు.
తాను ఓడిపోయినప్పుడు కడా ఎప్పుడూ బాధపడలేదని, ఇంతగా ఏడ్వలేదని అన్నారు. పార్టీ కోసం ఆర్థికంగా చాలా నష్టపోయానని చెప్పారు. అయితే పార్టీ తనను ఈరోజు మోసం చేసిందని అన్నారు. తన కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రమాదేవి వెల్లడించారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకున్నా.. ముథోల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు.