
హైదరాబాద్ కోకాపేటలో బీజేపీ నేతల ఆందోళనకు దిగారు. కోకాపేటలో ప్రభుత్వభూముల వేలంపై నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, హైదరాబాద్ కోకాపేటలో రెండో విడత భూముల వేలం గురువారం నిర్వహించారు. నియోపొలిస్ లే అవుట్‌లోని 45.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఏడు ప్లాట్లను ఈ వేలంకు ఉంచారు. అయితే కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 100.75 కోట్లు పలికింది. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ. 3,319.60 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 100.75 కోట్లు పలకగా, అత్యల్పంగా రూ. 67.25 కోట్లు పలికింది. ఎకరం భూమి సగటున రూ. 73.23 కోట్లు పలికింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ద్వారా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఉన్న 100 ఎకరాల భూమిని విక్రయించడానికి సిద్ధమైంది. ఆగస్టు 10న ఇ-వేలం నిర్వహించనున్నారు. నగదు కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భూముల వేలంతో రూ. 3,000-రూ. 3,500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది.