బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచినట్టు తెలుస్తున్నది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ను కిషన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావునూ ఆహ్వానించినట్టు తెలిసింది.
దక్షిణాదిలో సీట్ల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఏపీలో పొత్తులో టీడీపీ నుంచి సీట్ల సంఖ్యను ఎక్కువగా బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తున్నది. అలాగే.. తెలంగాణలోనూ ఈ సారి గతంలో కంటే ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. బలమైన నాయకులకూ గాలం వేసి తమ పార్టీలోకి రప్పించి గెలిపించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకున్నట్టు అర్థం అవుతున్నది.
ఇది వరకే ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలను కమలం పార్టీ కండువా కప్పి ఆహ్వానించింది. ఇప్పుడు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఆకర్షిస్తున్నది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ రోజు వరంగల్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో ఆయన హన్మకొండలోని సీతారాం నాయక్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు.
Also Read: March 8 - Top Ten News : టాప్ టెన్ వార్తలు
దీనిపై సీతారాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ తన అనుచరులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పార్టీలోకి వచ్చే నిర్ణయం పూర్తిగా ఆయన చేతిలోనే ఉన్నదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీతారం నాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కూడా బీజేపీ నాయకులు కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.