తెలంగాణ ఉద్యోగులకు మద్ధతుగా నిలిచేందుకే వచ్చానని అన్నారు బీజేపీ (bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda). తెలంగాణలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు తమ పోరాటం కొనసాగుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యోగులకు మద్ధతుగా నిలిచేందుకే వచ్చానని అన్నారు బీజేపీ (bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) . సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను ఎయిర్‌పోర్ట్ దగ్గరే అడ్డుకున్నారని మండిపడ్డారు. కరోనా నిబంధనలు అమల్లో వున్నాయని చెప్పారని నడ్డా తెలిపారు. పోలీస్ అధికారులు కేవలం తనను అడ్డుకోవాలనే చూశారని ఆరోపించారు. నిబంధనలను పాటిస్తూనే గాంధీజికి నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పానని నడ్డా తెలిపారు.
తాను అక్కడ సభను నిర్వహించవచ్చని.. కానీ కరోనా నిబంధనలు పాటించాలనే వచ్చేశానని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక ఉద్యమం నడుస్తోందని జేపీ నడ్డా ఆరోపించారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశాయని .. తెలంగాణలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేవరకు తమ పోరాటం కొనసాగుతుందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.
undefined
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా 317 జీవో ఇచ్చారని అన్నారు. జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలిపారు. సంజయ్ శాంతియుతంగా జాగరణ చేస్తుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని జేపీ నడ్డా మండిపడ్డారు. హుజురాబాద్‌లో ఓడినప్పటికీ నుంచి కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ తప్పారని.. దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణ వుందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల్లో విపరీతమైన అవినీతి జరిగిందని జేపీ నడ్డా ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని.. తాము ధర్మయుద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. మా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
అంతకుముందు పోలీసుల ఆంక్షల నడుమే జేపీ నడ్డా శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నడ్డా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ వున్నారు. ఈ సందర్భంగా నల్ల కండువాలు, మాస్క్‌లతో జేపీ నడ్డా ర్యాలీ నిర్వహించారు. ఆయన రాక విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు భారీగా సికింద్రాబాద్‌కు తరలివచ్చారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం భారీగా మోహరించారు.