
న్యూఢిల్లీ: తెలంగాణలో భీకర వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు చెరువలయ్యాయి. కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులను బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ రాజ్యసభలో కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణకు ‘వరద’ సహాయం చేయాలని కోరారు.
రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ బుధవారం మాట్లాడారు. తెలంగాణలో కురిసిన అకాల వర్షానికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. హైదరాబాద్, వరంగల్, ములుగు, భద్రాచలం ప్రాంతాల్లో వరదలు తీవ్ర ప్రభావం వేశాయని పేర్కొన్నారు. ఇక ములుగులో 16 మంది మరణించారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియాల్సి ఉన్నదని వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వరద సహాయక కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. భూపాలపల్లి జిల్లాలోని ఓ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయిందని, అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సకాలంలో స్పందించి గ్రామ ప్రజలను కాపాడారని తెలిపారు.
Also Read: యువతిని 14 ఏళ్లు బంధించి అఘాయిత్యం.. వెయ్యి సార్లు లైంగికదాడి
కాగా, భారీ వర్షానికి వరదలు పట్టణాలను ముంచెత్తడంతో బీజేపీ సహా అన్ని పార్టీల నేతలు క్షేత్రస్థాయి పరిశీలనలు చేశారు. కేంద్రం నిధులు ఇచ్చిందని, వరద బాధితులకు తక్షణమే సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరద నష్ట పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద రూ. 500 కోట్లు విడుదల చేసింది.