నిన్ను 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిస్తా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

By Siva KodatiFirst Published Jan 26, 2022, 7:46 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అర్వింద్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు

నిజామాబాద్ ఎంపీ (nizamabad mp), బీజేపీ (bjp) నేత ధర్మపురి అరవింద్‌పై మంగళవారం టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) మీడియాతో మాట్లాడుతూ... తనపై దాడికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (jeevan reddy) , నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కారణమని ఆరోపించారు. దాడిలో పాల్గొన్న వారంతా టీఆర్‌ఎస్‌ నేతలేనని అర్వింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనను నేరుగా ఎదుర్కోలేకనే టీఆర్ఎస్ పార్టీ దాడులను ప్రోత్సహిస్తోందని ఎంపీ మండిపడ్డారు. 

ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అర్వింద్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను 50 వేల మెజార్టీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ముందు దమ్ముంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ నుంచి టికెట్ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అర్వింద్ మండిపడ్డారు. ఈ దాడిని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని అర్వింద్ తెలిపారు. టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయని ఆయన జోస్యం చెప్పారు. 

కాగా... పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంగళవారం నందిపేట వెళ్తున్న క్రమంలో ఎంపీ అర్వింద్ ను ఆర్మూర్ మండలం ఆలూరు వద్ద టీఆర్ఎస్ నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పసుపు బోర్డు ఎక్కడంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే నందిపేటకు వెళ్తున్న ఎంపీ అర్వింద్ ను, బీజేపీ కార్యకర్తలను  మామాడిపల్లి చౌరస్తా వ‌ద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలతో కలిసి అర్వింద్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెర్కిట్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... ఎంపీ ల్యాడ్స్ నిధులతో నందిపేటలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుంటే.. టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకోవడం దుర్మార్గమని, కేంద్రం ఇచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేయ‌డం టీఆర్ఎస్  నేత‌లు ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. పర్యటన ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణుల యత్నించడంతో.. సీపీ నాగరాజుకు ఫోన్‌లో పరిస్థితిని వివరించినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. అయినా  స్పందన లేకపోవడంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్‌, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్దికి టీఆర్ఎస్ అడ్డు పడుతున్నది.. తనకు కాదనీ ఎంపీ అర్వింద్ విమర్శించారు.

click me!