బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని లేనిపక్షంలో దేశం విడిచిపోయే ప్రమాదం వుందన్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను సీజ్ చేయాలని లేనిపక్షంలో దేశం విడిచిపోయే ప్రమాదం వుందన్నారు. శనివారం కరీంనగర్‌లో పార్టీ పదాదికారుల సమావేశంలో బండి సంజయ్ ప్రసంగిస్తూ..కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి , అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల అవినీతిని బయటపెట్టాలని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలని.. కేసీఆర్ సీఎంగా వుండగా, సీఎంవోలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ల పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్‌ను ప్రస్తుతానికి మినహాయించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని.. ప్రస్తుతం దేశమంతా మోడీ గాలి వీస్తోందని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 350 సీట్లు సాధించి మరోసారి మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ వుంటుందని.. బీఆర్ఎస్ అడ్రస్త ఇక గల్లంతేనని సంజయ్ జోస్యం చెప్పారు. బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారంటూ దుయ్యబట్టారు. బంగారు పళ్లెమే అయితే ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు ఎందుకు వేయలేకపోతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారు.. నిరుద్యోగులకు ఉద్యోగాలేవీ అని ఆయన నిలదీశారు.