
Nizamabad Dharmapuri Arvind: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతించడంపై ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రూప్ 1 పోస్టులకు ఉర్దూ భాషలో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన ఓటు బ్యాంకు కోసం మైనారిటీ వర్గాన్నిఇలా ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ వీడియాతో మాట్లాడుతూ.. "ఇది విపరీతమైన చర్య. ముస్లింలను మభ్యపెట్టడం ఉద్దేశం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసిన గ్రూప్-1 పరీక్షను హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు ఎవరైనా సరిచేయవచ్చు. ఉర్దూలో రాసిన పరీక్షను ముస్లిం మాత్రమే సరిదిద్దగలరు" అని అన్నారు.ఇది ఆయా వర్గాల వారికి అనుకూలించే అవకాశాలున్నాయని ఆరోపించారు. ఇటీవల, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లీష్ మరియు తెలుగుతో పాటు ఉర్దూలో కూడా సమాధానాలు రాయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీనిపై ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థి, మూల్యాంకనం చేసేవారు ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడంతో ఇటువంటి చర్య అనుకూలతను ప్రోత్సహిస్తుందని.. ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీని కారణంగా హిందువులకు గ్రూప్-1 పోస్టులు వచ్చే అవకాశాలను దెబ్బతీస్తుందని అరవింద్ ఆరోపించారు. "ముస్లింలు అన్ని ముఖ్యమైన స్థానాలను నిర్వహిస్తారు మరియు హిందువులు గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పొందుతారు. సగం మరియు పూర్తి ఒక మార్కు ఎక్కువ పొందడం ద్వారా వారు (ముస్లింలు) 'తీస్మార్ఖన్' అవుతారు.. మేము (హిందువులు) వారి బానిసలుగా మారతాము” అని బీజేపీ ఎంపీ అన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తహసీల్దార్లు, డిప్యుటీ కలెక్టర్లు ఇతర గ్రూప్వన్ఉద్యోగాలన్నీ ముస్లింలకే వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముస్లింలకు అప్పగిస్తోందని, ఇది రజాకార్ల పాలన కాదా అని ప్రశ్నించారు. తెలంగాణను మళ్లీ నిజాం స్టేట్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హిందూ సమాజం కండ్లు తెరవాలనీ, రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని బుద్ది చెప్పాలంటూ పిలుపునిచ్చారు.
అలాగే, భారతీయ జనతా పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టబోతున్నానంటూ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన ప్రకటన పై కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. మల్లన్న బీజేపీని వీడుతున్నట్లు తనకు సమాచారం లేదన్నారు. ఈ విషయమై తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి అడిగానని.. అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చాడని చెప్పారు. అయితే, ప్రస్తుతం తీన్మార్ మల్లన్న బీజేపీలో కొనసాగే విషయంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై బీజేపీ నేతలేవరూ పెద్దగా స్పందించడం లేదు.