
హైదరాబాద్: ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలకు మంగళవారం నాడు అపాయింట్ మెంట్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
సోమవారం నాడు రాత్రి పూట న్యూఢిల్లీ నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి తిరిగి వచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలకు సంబంధించి సంకేతాలు వెలువడిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.
హైద్రాబాద్‌లో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరేందుకు సీఎం కేసీఆర్‌తో సమావేశమైనట్టుగా బీజేపీ కార్యాలయం నుండి మీడియాకు సమాచారం అందింది.
మూడు రోజుల పాటు న్యూఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీగా గడిపారు. ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయమై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు.
అయితే చాలా కాలంగా విపక్ష పార్టీలకు చెందిన నేతలకు కానీ, ఎమ్మెల్యేలకు కూడ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. కానీ, ఢిల్లీ నుండి వచ్చిన మరునాడే బీజేపీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
అయితే ఈ పరిణామాన్ని తెలంగాణలో రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. కేసీఆర్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఢిల్లీలో చోటుచేసుకొన్న పరిణామాలకు సంబంధించి కేసీఆర్ బీజేపీ నేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం.
రాజకీయాలపై తాము చర్చించలేదని సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు.