
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై (kcr) తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోషామహాల్ బీజేపీ (bjp) ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh). నిజామాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు పరిపాలన చేతకావడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని రాజాసింగ్ అన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తన అనుచరులతో అక్రమ దందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు కబ్జాల పర్వమేనంటూ రాజాసింగ్ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ప్రజలు ఇంటికి పంపడం ఖాయమంటూ ఆయన జోస్యం చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చునే అర్హత కేసీఆర్‌కి లేదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలకు అంతు లేకుండా పోయిందని రాజాసింగ్ ఆరోపించారు.
ఇకపోతే... కొద్దిరోజుల క్రితం రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో వస్తాయని.. సీఎం కేసీఆర్‌కు చాలెంజ్ చేసి చెబుతున్నానని అన్నారు. గురువారం బోధన్ మండలం నర్సాపూర్‌లో ప్రజల గోస- బీజేపీ భరోసా బైక్ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులకు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు పదవులపై నమ్మకం లేదని అన్నారు. వారంతా ఎప్పుడు పదవి ఊడుతుందోనన్న భయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే వరద సాయం అడుగుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళే పంచుకున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే మోదీ హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్ ఏవో పనులు పెట్టుకుని మోహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రెండేళ్లలో కేంద్రం ఇచ్చిన వరద సహాయాన్ని రాష్ట్ర ప్రబుత్వం ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ALso Read:మహారాష్ట్ర రాజకీయాలు త్వరలో తెలంగాణలో వస్తాయి.. చాలెంజ్ చేసి చెబుతున్నా: రాజా సింగ్
ఇక, మహారాష్ట్రలో మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం కూలినట్టుగా.. తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయమనే బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్స్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే తెలంగాణలో ఏక్‌నాథ్ షిండేను తీసుకురావాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తానేవరికీ భయపడనని.. తనకు మనీలేదు, లాండరింగ్ లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మాతో గోక్కుంటే అగ్గేనని.. మీరు మాతో గోక్కున్నా .. గోక్కోకపోయినా నేను మిమ్మల్ని గోకుతూనే వుంటానని కేసీఆర్ పేర్కొన్నారు. మీ ఉడుత ఊపులకు భయపడేది లేపదన్నారు.