దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పనే అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై రఘునందన్ స్పందించారు.
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీ ప్రస్తుతం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఎన్నికల సమయంలో... అదీ ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఈ హత్యాయత్నం ఘటనతో సంబంధముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బిఆర్ఎస్ శ్రేణులు, ప్రభాకర్ రెడ్డి అనుచరులు బిజెపికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇలా అధికార పార్టీ ఎంపీపై కత్తిదాడి ఘటనలో తన పేరు వినిపిస్తుండటంతో రఘునందన్ రావు స్పందించారు.
ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం దురదృష్టకరమని... ఆయనపై కత్తితో దాడిచేసి చంపే ప్రయత్నం జరగడం బాధాకరమని అన్నారు. ప్రభాకర్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించాలని... త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలన్నారు. అయితే ఈ ఘటనను రాజకీయం చేయడం తగదని రఘునందన్ అన్నారు.
ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనతో తనకు సంబంధం వుందంటూ ప్రచారం చేస్తున్నారని... ఇది సరికాదని రఘునందన్ రావు అన్నారు. ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని... దాడికి పాల్పడిన రాజు ఎవరోకూడా తనకు తెలియదన్నారు. రాజకీయ లబ్ది కోసం ఈ ఘటనతో తనకు ముడిపెట్టి బురదజల్లడం సరికాదని అన్నారు. ఎంత దుష్ప్రచారం చేసినా తానేంటో దుబ్బాక ప్రజలకు తెలుసు... కాబట్టి అక్కడ బిజెపి గెలుపును ఎవరూ ఆపలేరని రఘనందన్ రావు అన్నారు.
Read More కొత్త ప్రభాకర్ రెడ్డి కడుపులో ఆరు సెం.మీ. కత్తిగాటు: హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
స్థానిక యూట్యూబ్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేసే గటాని రాజు దళిత బంధు రాకపోవడంతో అధికార పార్టీపై కోపం పెంచుకున్నట్లు తెలుస్తోందని రఘునందన్ రావు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బిఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడినట్లు వార్తలు వెలువడుతున్నాయని అన్నారు. ఈ దాడిలో రాజకీయాల పాత్ర ఏమీ లేదని రఘునందన్ పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ఎంపీపై దాడికి పాల్పడిన రాజు కాంగ్రెస్ సానుభూతిపరుడని అతడి సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలిస్తే తెలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే అతడు ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు... ఇందుకు సంబంధించిన ఐడీ కార్డు కూడా దొరికింది. కానీ సిద్దిపేట పోలీస్ కమీషనర్ ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండానే రాజు బిజెపి సానుభూతిపరుడని అనడం సరికారదన్నారు. సిపి వ్యాఖ్యలతో ఆవేశానికి గురయిన బిఆర్ఎస్ నాయకులు బిజెపి కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని రఘునందన్ ఆందోళన వ్యక్తం చేసారు. పూర్తి సమాచారం సేకరించాక నిందితుడు రాజు గురించి సిపి మాట్లాడితే బావుండేదని అన్నారు.
ప్రస్తుతం మహబూబ్ నగర్ లో వున్న తాను హైదరాబాద్ కు వెళ్లగానే ప్రభాకర్ రెడ్డిని పరామర్శించనున్నట్లు రఘునందన్ తెలిపారు. ప్రభాకర్ రెడ్డి కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే శతృవు కాదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.