మాజీ నక్సలైట్లతో విపక్ష నేతలపై దాడులకు టీఆర్ఎస్ కుట్ర : ఈటల సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 19, 2022, 6:59 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పథకం ప్రకారమే ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని.. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారని ఈటల ఆరోపించారు. 
 

పథకం ప్రకారమే ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శనివారం ఎంపీ అర్వింద్, ఆయన తల్లిని ఈటల పరామర్శించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వమన్నారు. ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తున్నారని రాజేందర్ ఆరోపించారు. పోలీసుల పహారాలో రాజ్యం నడుపుతున్నారని... నైరాశ్యంతో సహనం కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్ళ కింద భూమి కదిలిపోయి గెలవలేమని దాడులు చేస్తున్నారని రాజేందర్ దుయ్యబట్టారు. అర్వింద్ ఇంటి మీద పోలీసుల పర్యవేక్షణలో, పోలీసు వారి అండదండలతో దాడి చేశారని ఈటల ఆరోపించారు. 

సరైన సమయంలో బుద్ది చెప్పడానికి ప్రజలు వేచి చూస్తున్నారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇదే మొదటిది కాదన్న ఆయన.. బండి సంజయ్ పాదయాత్రలో , మునుగోడు ఎన్నికల్లో భయబ్రాంతులు సృష్టించేందుకు రాజగోపాల్ రెడ్డి మీద దాడులు చేశారని రాజేందర్ ఆరోపించారు. మా అత్త గారి ఊర్లో తన భార్యతో, గ్రామ మహిళలతో ఉండగా తనపైనా దాడి చేశారని ఈటల అన్నారు. ఇద్దరు జిల్లా పరిషత్ చైర్మన్లు, నర్సంపేట ఎమ్మెల్యే, పల్లా రాజేశ్వర్ రెడ్డి దాడికి దిగారని.. కర్రలకు ముల్లులు కట్టుకొని , బస్తాల్లో రాళ్ళు నింపుకొని వచ్చి మా రక్తం కళ్ళజూసారని రాజేందర్ ఆరోపించారు. 

ALso Read:పోలీసులు సహకారంతోనే అరవింద్ ఇంటిపై దాడి.. దాడి ఘటనపై కేసీఆర్ తక్షణమే స్పందించాలి: బండి సంజయ్

ఈ దాడులపై అమిత్ షాకి, కేంద్రానికి ఉత్తరం రాస్తామని... ప్రతిపక్ష నాయకుల ప్రాణాలు కాపాడటంలో, ప్రజలకు రక్షణ కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అసెంబ్లీకి రానివ్వడం లేదని.. తానే చండశాసనుడిని అన్నట్టు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. కెసిఆర్ రాజులాగా, చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్యే, ఎంపీ, కార్యకర్తల మీద కెసిఆర్ పట్టు కోల్పోయారని... కేవలం తన కుటుంబ కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం టీఆర్ఎస్ కార్యకర్తలకు అర్థం అయ్యిందని.. అందుకే వారు కెసిఆర్ మీద విశ్వాసం కోల్పోయారని ఈటల వ్యాఖ్యానించారు. 

పార్టీని బ్రతికించుకొనే ప్రయత్నంలో భాగమే ఈ దాడులేనని రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా ఎల్పీ మీటింగ్ లో బీజేపీ వారిమీద దాడులు చేయండి నేను చూసుకుంటా అని చెప్పారంటే ఏం అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఒక మహిళ అయి ఉండి కూడా కొట్టి కొట్టి చంపుతామని మాట్లాడుతోందని, ఎటు పోతున్నామని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మనమిచ్చిన అధికారంతో మన మీదనే దాడులు చేస్తున్నారని.. దీనికి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. 

రాష్ట్రం విఫలం అయినప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందని... ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేసీఆర్‌కు బానిసల్లెక్క మారారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తాము ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళమని ఆయన స్పష్టం చేశారు. మాజీ నక్సలైట్లను కూడగట్టుకొని దాడులు చెయ్యాలని పథకం వేస్తున్నారని, దీనిపై అమిత్ షాకి నివేదిక పంపుతామని ఈటల తెలిపారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని... హిట్లర్ , ముస్సొలిని అనుకుంటున్నారని, వారికి పట్టినగతే ఈయనకు పడుతుందని రాజేందర్ జోస్యం చెప్పారు. 

 

click me!