
బీజేపీలో తాను ఇమడలేకపోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో సుదీర్ఘకాలం, కీలక హోదాల్లో పనిచేసిన ఓ నాయకుడు కొత్త పార్టీలో చేరితే చిన్ని చిన్న సమస్యలు ఎదురవ్వడం సహజమేనన్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుపోవడానికి సమయం వుంటుందని.. ఏ పార్టీలోనైనా ఇది సహజమని ఈటల స్పష్టం చేశారు.
బీజేపీలో పాత, కొత్త నేతల మధ్య ఎలాంటి వివక్ష, వివాదాలు లేవని రాజేందర్ తెలిపారు. వేరే పార్టీల నుంచి వచ్చే నేతల అనుభవాన్ని పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలన్నదే బీజేపీ పెద్దల ఉద్దేశ్యమన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు తప్పకుండా తమ వ్యక్తిగత పెరుగుదలను కూడా కోరుకుంటారని రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారినప్పుడు పదవులు ఆశించడం దేశంలో కామన్ అన్నారు.
ALso Read: తెలంగాణ బీజేపీలో అసమ్మతి సెగ.. బీజేపీ అధిష్టానానికి ఈటల ఏం చెప్పారు..?
కానీ తాను తన జీవితంలో ఏనాడూ పదవి కావాలని నోరు తెరిచి అడగలేదని.. ఇకపైనా అడగనని రాజేందర్ స్పష్టం చేశారు. తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలనేది పార్టీ పెద్దల ఇష్టమన్నారు. వారు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని.. తనకు చేరికల కమిటీ బాధ్యతలు ఇవ్వగా రాష్ట్రంలోని పలువురు నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించానని రాజేందర్ తెలిపారు.
ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల విధానాలపై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల్లో .. రాష్ట్రంలోని జరిగే విషయాలను కళ్లతో చూస్తూ , చెవులతో వింటూ నిర్ణయాలుంటాయని తెలిపారు. జాతీయ పార్టీలు దీనికి పూర్తి భిన్నంగా రాష్ట్రాలలో జరిగే విషయాలను వినడమే తపించి చూడలేవన్నారు. అందుకే జాతీయ పార్టీల్లో వున్న వారు ఖచ్చితంగా ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.