Etela Rajender: వేల కోట్లు నీటి పాలు.. తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలి

By Rajesh Karampoori  |  First Published Oct 24, 2023, 5:02 AM IST

Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పే సీఎం కేసీఆర్ ఇప్పడేం జవాబు చెబుతారని ప్రశ్నించారు.


Etela Rajender:  కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు పేరు  రావాలని సంకుచిత ఆలోచనతో రి డిజైనింగ్ చేసి.. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని విమర్శించారు. నాంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  సోమవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  

రి డిజైనింగ్ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని సీఎం కేసీఎం దుర్వినియోగం చేశారనీ, ప్రాజెక్టులపై ఇంజనీర్ల అనుమానాలు నిజమేనని రుజువైందని ఈటల అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం ఆందోళనకర చెందాల్సిన విషయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకున్న సీఎం కేసీఆర్ బొక్కబోర్లా పడ్డారని, ఆయన కట్టిన మూడు ప్రాజెక్టులూ దెబ్బతిన్నాయని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.

Latest Videos

తెలంగాణలో ఇలాంటి తరహా ప్రాజెక్టులు ఎవరూ కట్టలేదనీ, ప్రాజెక్టులు ఇంత తొందరగా  డ్యామేజ్ కాలేదని విమర్శించారు. వాస్తవానికి ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్న స్థలం సరైందని కాదనీ, అక్కడ భూమిని పరీక్ష కుండా  బ్యారేజీ నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. ఇసుక దిబ్బలపై బ్యారేజీ కట్టారని ఆరోపించారు. ఇప్పుడు 20వ నెంబర్ పిల్లర్ కుంగిపోయిందనీ, మిగిలిన అన్ని పిల్లర్ల పటిష్టతను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం నిర్మించామంటూ నిర్మాణ సంస్థ వెల్లడించిందనీ  గుర్తు చేశారు. రూ.వేలాది కోట్లతో కట్టిన బ్యారేజీ ఇప్పుడు నీళ్ల పాలు చేశారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మొత్తానికి ప్రధాన కారకుడు సీఎం కేసీఆరేనని, దీనికి పూర్తి బాధ్యత ఆయననే వహించాలని,  ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పే సీఎం కేసీఆర్, కేటీఆర్ లు వంతెన కొంగుబాటుపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.

click me!