మీ ప్రశ్నలకు రేపటి సభలో సమాధానమిస్తాం.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ కౌంటర్

By Siva KodatiFirst Published Aug 20, 2022, 7:19 PM IST
Highlights

మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని.. ఆయన ప్రశ్నలకు రేపటి సభలో సమాధానమిస్తామని అన్నారు. 

మునుగోడులో శనివారం జరిగిన టీఆర్ఎస్ ప్రజా దీవెన సభలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కేసీఆర్ చెప్పే చిల్లర మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. ప్రజలను మెప్పించే శక్తిని కేసీఆర్ కోల్పోయారని.. ఆయనను ఈసారి గెలవనివ్వమని రాజేందర్ హెచ్చరించారు. కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని.. ఆయన ప్రశ్నలకు రేపటి సభలో సమాధానమిస్తామని అన్నారు. 

వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలన్న ఆలోచన కేంద్రానికి లేదని.. బీజేపీకి ఓటేస్తే మీటర్లు వస్తాయన్నది అవాస్తవమని రాజేందర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్ధితి లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రజల పక్షం అని చెప్పుకునే సీపీఐ నేతలు ఎప్పుడైనా సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యలు చెప్పారా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. 

Also Read:ఈడీ వాళ్లు వస్తే నాకే చాయి తాగించి పోతారు.. కాంగ్రెస్‌కు ఓటేస్తే వృథానే: సీఎం కేసీఆర్

అంతకుముందు మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల బాయిల కాడ కరెంట్ మీటర్లు పెట్టమంటే తాను పెట్టలేదని చెప్పారు. రైతులు, భూములను కూడా మోదీ సర్కార్ అమ్మేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారని ఆరోపించారు. రైతులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదని.. మన బతుకు ఎన్నిక అని కేసీఆర్ చెప్పారు. ప్రజలు దీని గురించి గ్రామాల్లో చర్చించాలని కోరారు. 

రైతు బంధు, పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రులు తమను నిలదీశారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు బంద్ పెట్టాలని అంటున్నారని తెలిపారు.గుజరాత్ ఇస్తున్నా రూ. 600 పింఛను ఇక్కడ ఇవ్వాలని అంటున్నారని చెప్పారు. కేంద్రం అన్నింటిపై జీఎస్టీ వసూలు చేస్తూ బ్యాంకులను ముంచే వాళ్లకు పంచుతుందని విమర్శించారు. దేశంలో విద్వేషం పుట్టిస్తే మంచిదా? అని ప్రశ్నించారు. మత విద్వేషాలు పెరిగితే నష్టపోయేది దేశ ప్రజలేనని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడిపోయిందని చెప్పారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు. దేశంలో నుంచి బీజేపీని తరిమికొట్టాలని పిలపునిచ్చారు. 

బీజేపీ వాళ్లకు ఎందుకింత అహంకారం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రాలలో విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోయాలని చూస్తుందని మండిపడ్డారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ సర్కార్‌ను పడగొడతా అంటున్నారని తెలిపారు. మోదీని ఆయన అహంకారమే పడగోడుతుందని చెప్పారు. ఈడీకి దొంగలు, లంగలు భయపడతారని.. తామేందుకు భయపడతామని కేసీఆర్ అన్నారు. ఈడీ వస్తే తన దగ్గర ఏముందని.. వాళ్లే తనకు చాయి తాగించి పోవాలే అని అన్నారు. బీజేపీ గోకినా గోకకపోయినా.. నేను గోకుతా అని చెప్పానని అన్నారు. మునుగోడులో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్లు రాలేదని అన్నారు. 

click me!