
కరీంనగర్: హుజురాబాద్ ఎన్నిక (huzurabad bypoll) సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై హామీలను గుప్పించిందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (eatala rajender) పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులున్నాయో, లేవో తెలుసుకోకుండానే ఓట్ల కోసమే ఎవరు ఏం అడిగినా ప్రొసీడింగ్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఆధారంగా దళిత బంధు అమలు కావడానికి నలభై ఏళ్ళు పడుతుందని ఈటల పేర్కొన్నారు.
హుజూరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బిజెపి (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసారు. ఈ హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ కేసీఆర్ సర్కార్ ను ఈటల నిలదీసారు.
''ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పదుల సంఖ్యలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉపఎన్నిక సమయంలో హుజురాబాద్ లో మోహరించారు. వీరు స్థానిక ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల వేళే దళితుల మీద సీఎం కేసీఆర్ కు ప్రేమ పుట్టింది. దళిత కుటుంబాల్లో ఉద్యగస్తులతో సహా అందరికీ దళిత బంధు (dalit bandhu) ఇస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివారులో భూములను అమ్మగా వచ్చిన డబ్బును ఇందుకోసం జమ చేసారు. నవంబర్ 4 తర్వాత తానే స్వయంగా అమలు చేస్తానని చెప్పారు. కానీ ఆ ఏడాది గడిచి ఈ ఏడాది ఫిబ్రవరి వచ్చినా దళిత బంధు అమలు కావడం లేదు'' అని ఈటల గుర్తుచేసారు.
''రాష్ట్రవ్యాప్తంగా 17 వేల కుటుంబాలకు దళిత బందు ఇస్తామని కేవలం 190 కుటుంబాలకే ఇచ్చారు. ఒక్క నియోజకవర్గంలో ఇవ్వడానికే ఇన్నిరోజులు పడితే రాష్ట్రమంతా ఇవ్వడానికి ఎన్నిరోజులు పట్టాలి? ఇక ఒక్క సంవత్సరమే అధికారం మిగిలి ఉంది... ఈ కాలంలో రాష్ట్రంలోని దళిత కుంటుంబాలన్నింటికి దళిత బందు పథకం అమలు సాధ్యమేనా?'' అని ఈటల ప్రశ్నించారు.
''దళిత బందు డబ్బులపై కలెక్టర్, బ్యాంకుల పెత్తనం ఉండవద్దు. దళిత కుటుంబాలకు షెడ్లు వేసుకోవడానికి స్థలాలు ఉండవు... హర్యానా బర్రెలకు పాలు పిండాలంటే బీహార్ నుండి వ్యక్తులు రావాలి. కాబట్టి ఇలాంటి వ్యాపారాలు కాకుడా దళిత కుటుంబాలకు అందుబాటులో ఉండే వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి'' అని ఈటల సూచించారు.
''ప్రజలు ఓట్లువేసి గెలిపించిన ఎమ్మెల్యేకే ప్రభుత్వ పథకాల్లో ప్రమేయం లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు టీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుండి ఇవ్వడం లేదు... ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల నుండి ఇస్తున్నారు'' అని అన్నారు.
''ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న బెల్ట్ షాపుల్లో మద్యం తాగి అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంలో జిల్లా కలెక్టర్,లు మంత్రులు పోటి పడే పరిస్థితి ఏర్పడింది'' అంటూ ఈటల ఆందోళన వ్యక్తం చేసారు.
''హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూం కట్టలేదని గతంలో స్వయంగా మంత్రులే అన్నారు... కానీ ఇప్పుడు ప్రజల దరఖాస్తులు తీసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణమే జరగనప్పుడు ఇళ్ల కోసం దరఖాస్తులెలా తీసుకుంటారు. బిజెపి నాయకులు ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దాడుతున్నారు అని అంటున్న సిఎం కేసీఆర్ మరి హుజూరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో జరిగేదెంటో చెప్పాలి. మాకు భాష రాక కాదు ఓపిక పడుతున్నాం'' అని ఈటల అన్నారు.
''డబుల్ బెడ్రూం ఇళ్ళ పంపిణీలో భర్తలు చనిపోయిన ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీలో ఎమ్మెల్యే ప్రాధాన్యత లేదని కొందరు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారట... ఆ ఇళ్లు ఎవరి తాత జాగీరు కాదు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో బ్రోకర్లను నమ్మకండి'' అని ప్రజలకు సూచించారు.
''అసరా పెన్షన్ లు ఎందుకు అపుతున్నారు... ఇప్పుడు ఎన్నికల నిభందనలు లేవు కదా? ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకుండా నేను ఎమ్మెల్యే అంటే నేను ఎమ్మెల్యే అంటున్నారు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ఇకముందు నడవవు'' అని ఈటల హెచ్చరించారు.
''ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడే ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి అని తేలిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు ఏం చేసిన నడిసింది కానీ ఇప్పుడు నడువదు'' అని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులను ఈటల హెచ్చరించారు.