సిరిసిల్లలో ఉద్రిక్తత... బారికేడ్లను లాగేసి, పోలీసులను తోసుకుంటూ... కేటీఆర్ ఇలాకాలో బిజెపి ఆందోళన (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 12, 2021, 9:58 AM IST
Highlights

ఐటీ మంత్రి కేటీఆర్ సొంత  నియోజకవర్గం సిరిసిల్లలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి శ్రేణులు కలెక్టరేట్ వద్ద ఆందోళన దిగి పోలీసులను, బారికేేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడమే ఈ ఉద్రిక్తతకు కారణమయ్యింది. 

సిరిసిల్ల: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి శ్రేణులు నిరసనకు దిగడం... వీరిని టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులతో కూడా బిజెపి శ్రేణులకు తోపులాట జరిగింది. అయితే ఆందోళన  చేస్తున్న బిజెపి నాయకులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలోని అధికారపార్టీ TRS, దేశంలో అధికారంలో వున్న బిజెపి కయ్యానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయకుండా యాసంగిలో పండించే వరి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు సిద్దమయ్యింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు టీఆర్ఎస్ సిద్దమయ్యింది. 

వీడియో

అయితే రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలంలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని... వెంటనే రైతులవద్దగల ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ నిన్న (గురువారమే) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద BJP ధర్నాకు దిగింది.  ఈ క్రమంలోనే rajanna siricilla district సమీకృత కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు ధర్నాకు దిగారు.

read more పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తాం..: కేంద్ర సర్కారుకు తలసాని హెచ్చరిక (వీడియో)

ఇలా కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు ధర్నా చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడి బిజెపి నాయకులపై విమర్శలు చేసారు. దీంతో బిజెపి నాయకులు ఆగ్రహంతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

అడ్డంగా ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బిజెపి నాయకులు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు బిజెపి నాయకులను అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  

టీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కార్యాలయంలోకి  ఎలా వెళ్లారంటూ బిజెపి నాయకులు పోలీసులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు తమపై భౌతిక దాడికి ప్రయత్నించారని బిజెపి నాయకులు ఆరోపించారు. భౌతిక దాడికి దిగిన అధికార టీఆర్ఎస్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేసారు. 

read more  బీజేపీ నేతలు అవగాహన లేకుండా ధర్నాలు చేస్తున్నారు.. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

శాంతియుతంగా రైతుల కోసం ధర్నా చేస్తున్న తమను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయబోయే ధర్నాను కూడా తాము అడ్డుకుంటామని బిజెపి నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా సిరిసిల్ల పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు దిగాయి. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర బిజెపి సర్కార్  వైఖరిని నిరసిస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో  గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తల ధర్నాలు, నిరసనలు కొనసాగనున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో మూడు వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేసారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది టీఆర్ఎస్ నాయకులు రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొననున్నారు. 

click me!