గౌరవానికి భంగం, అనుభవం బేఖాతరు.. మోత్కుపల్లి బాటలో మరికొందరు బీజేపీ నేతలు

By Siva KodatiFirst Published Jul 23, 2021, 3:42 PM IST
Highlights

మోత్కుపల్లి నరసింహులు బాటలోనే పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరిన తమకు కనీస గౌరవం దక్కడంలేదని అనుచరులవద్ద ఆవేదన వ్యక్తం చేశారట.

తెలంగాణ బీజేపీకి  మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన బాటలోనే టీఆర్ఎస్‌లో చేరేందుకు పలువురు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా సమాచారం. మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత చాలా మంది బీజేపీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తెలుగుదేశం నుంచి గతంలో కొందరు నేతలు బీజేపీలో చేరారు. వాళ్లంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీలో చేరిన తమకు కనీస గౌరవం దక్కడంలేదని అనుచరులవద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏమైనా పార్టీ కార్యక్రమాలు చేయాలంటే చిన్నా, చితక నాయకుల అనుమతి తీసుకుని చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. 

తమ అనుభవాన్ని బీజేపీ నాయకత్వం సరిగా ఉపయోగించుకోవటం లేదని మాజీ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టే స్వేచ్ఛ కూడా తమకు లేదని మండిపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు సాయం చేద్దామనుకుంటే...తమనే బంధించే ప్రయత్నం జరుగుతోందని వాపోతున్నారు. కాగా హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ నేతలు ఇతర పార్టీల్లోచేరితే బీజేపీకి తీరని నష్టం జరిగే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Also Read:ఈటల అవినీతి పరుడు, అందుకే బీజేపీని వీడా: మోత్కుపల్లి నర్సింహులు

అంతకుముందు బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ..అసలు రాజేందర్ ను నెత్తిన మోయాల్సిన అవసరం బీజేపీకి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. దళితుల భూములను ఈటల ఆక్రమించుకున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఈటలకు ఇంత ఆస్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని బీజేపీ ఉపయోగించుకోలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. కనీసం బీజేపీ కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. 

click me!