నా చూపు లోక్‌సభ పైనే , అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు .. కానీ , విజయశాంతి ఆసక్తికర ట్వీట్

Siva Kodati |  
Published : Oct 18, 2023, 08:41 PM IST
నా చూపు లోక్‌సభ పైనే , అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లేదు .. కానీ , విజయశాంతి ఆసక్తికర ట్వీట్

సారాంశం

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాదని, కానీ అధిష్టానం ఆదేశిస్తే అందుకు సిద్ధమేనని పేర్కొన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి  . వ్యూహాత్మక నిర్ణయాల కోసం పార్టీ నిర్దేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని విజయశాంతి స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆమె.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం తన ఉద్దేశం కాదని, కానీ అధిష్టానం ఆదేశిస్తే అందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. తాను మొదటి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపైనే దృష్టి పెట్టామని విజయశాంతి వెల్లడించారు. అయితే కార్యకర్తలు మాత్రం తనను కామారెడ్డి, బండి సంజయ్‌ని గజ్వేల్ నుంచి పోటీ చేయమని కోరుతున్నారని రాములమ్మ తెలిపారు. బీఆర్ఎస్‌పై పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని.. కార్యకర్తలు కోరడంలోనూ తప్పు లేదన్నారు. వ్యూహాత్మక నిర్ణయాల కోసం పార్టీ నిర్దేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని విజయశాంతి స్పష్టం చేశారు. 

ఇకపోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని జనసేన పార్టీని బీజేపీ కోరింది. వివరాలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని పవన్‌ను కోరారు. అయితే జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కల్యాణ్.. బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ నాయకుల కోరిక మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి తప్పుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని చెప్పారు.

Also Read: నిన్ను ‘కుక్కా’ అన్నా సింపతీ రాదు.. కవితపై అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని పవన్ బీజేపీ నాయకులకు తెలియజేసినట్టుగా జనసేన పార్టీ తెలిపింది. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ఇక, ప్రస్తుతం ఎన్డీయేలో జనసేన భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఏపీలో టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత.. జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన సిద్దమైనట్టుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. అయితే తాజాగా తెలంగాణ జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణాలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలా? లేదా ? అనే విషయంపై జన కార్యకర్తల, నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే