సీబీఐ విచారణలో కవిత వాస్తవాలు చెప్పాలి.. : తరుణ్ చుగ్

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 12:16 PM IST
Highlights

చట్టం ముందు  అందరూ సమానులేనని  బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపించారు.

చట్టం ముందు  అందరూ సమానులేనని  బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం, కేజ్రీవాల్ ప్రభుత్వం పాత్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్, కవితలు పదే పదే ఢిల్లీకి  ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. సీబీఐ విచారణకు కవిత సహకరించాలని అన్నారు. సీబీఐ విచారణలో ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు చెప్పాలన్నారు. 

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి.. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద కవితకు సీబీఐ నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని కవిత నివాస చిరునామాను సీబీఐ నోటీసులో పేర్కొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా కవితకు సంబంధం ఉన్న కొన్ని వాస్తవాలను గుర్తించామని పేర్కొంది. అందువల్ల దర్యాప్తు కోసం ఆమె నుంచి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 11 గంటలకు విచారణ కోసం.. ఆమె సౌలభ్యం మేరకు హైదరాబాద్ లేదా ఢిల్లీలోని నివాస స్థలాన్ని తెలియజేయాలని కవితను సీబీఐ అధికారులు కోరారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని తన నివాసంలో తనను కలుసుకోవచ్చని.. ఇంటి వద్దే వారికి వివరణ ఇస్తానని కవిత చెప్పారు. ఈ క్రమంలోనే కవిత నేడు ప్రగతి భవన్‌లో సీబీఐ నోటీసులపై తన తండ్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించే అవకాశం ఉంది. సీబీఐ నోటీసులపై ఎలాంటి  వైఖరితో ముందుకు సాగాలి, వీటిని ఏ విధంగా ఎదుర్కొవాలనే అంశంపై కవిత కుటుంబ సభ్యులతో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.

click me!