
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అంబేద్కర్ సేవలను కొనియాడుతూ నివాళి అర్పిస్తున్నారు. మరి కొందరు సామాజిక మాధ్యమాల్లో రాజ్యాంగ నిర్మాతపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నాయకురాలు కూడా ట్విట్టర్ లో ఓ పోస్టు చేశారు. కానీ అది విపరీతంగా ట్రోలింగ్ కు గురువుతోంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉందా ? అయితే చదివేయండి మరి..
అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారతీయులను విభజించేవారే నిజమైన దేశ ద్రోహులు - సోనియా గాంధీ
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ యూత్ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి విభాగం కో-కన్వీనర్ కసిరెడ్డి సింధూరెడ్డి శుక్రవారం ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. అందులో అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ క్యాప్షన్ పెట్టారు. కానీ ఆ పోస్టులో అంబేద్కర్ ఫొటోకు బదులు స్వామి వివేకానంద ఫొటోను పెట్టారు. అయితే ఈ ట్వీట్ ను ఆమె వెంటనే డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే చాలా మంది స్క్రీన్ షాట్ లు తీసుకున్నారు. దానిని మళ్లీ పోస్టు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
ఆమె చేసిన పోస్టులో ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను, భారత సమాజ అభ్యున్నతికి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన అలుపెరగని కృషిని స్మరించుకుంటున్నాం’’ అని సింధు రెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో స్వామి వివేకానంద విగ్రహానికి ఆమె దండం పెడుతూ ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ.. ఇది వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థుల తెలివి అని విమర్శిస్తున్నారు.
‘‘బాబాసాహెబ్ అంబేడ్కర్, స్వామి వివేకానంద కు మధ్య తేడాను బీజేపీ నాయకులు తెలుసుకోవాలి. వాట్సాప్ యూనివర్శిటీ విద్యార్థులు’’ అంటూ బీఆర్ఎస్ కు చెందిన క్రిశాంక్ అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేశారు. వైఎస్ఆర్ అనే మరో యూజర్.. ‘ఫేక్ డిగ్రీ’ పార్టీలో ఉండటం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటంటే.. స్వామి వివేకానంద చిత్రపటంతో అంబేద్కర్ చిత్రపటానికి శుభాకాంక్షలు తెలపడం’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే కసిరెడ్డి సింధూరెడ్డి తన మొదటి పోస్టు డిలీట్ చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేస్తున్న ఫొటోతో తరువాత మరో పోస్టు పెట్టారు.