లుకౌట్‌ నోటీసుల పేరుతో అసత్య ప్రచారం.. వారిపై చర్యలు తీసుకోండి: బీజేపీ నేత రామచందర్ రావు

By Sumanth KanukulaFirst Published Nov 22, 2022, 4:54 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ విచారణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆరోపించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ విచారణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆరోపించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు లుక్ అవుట్ నోటీసుల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చౌకబారు రాజకీయాలు చేస్తే బీజేపీ భయపడదని అన్నారు. బీఎల్ సంతోష్‌కు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడానికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొన్ని గైడ్ లైన్స్‌ ఉన్నాయని చెప్పారు. 

రావుల శ్రీధర్, వై సతీష్ రెడ్డి అనే వ్యక్తులు ఏం అధికారం ఉందని లుకౌట్ నోటీసులు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ అసత్య ప్రచారంపై దర్యాప్తు అధికారులు స్పందించాలని కోరారు. అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా తప్పుడు ప్రచారం చేసేవారి ఆ పోస్టులను ఉపసంహరించుకుని.. క్షమాపణలు చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్‌తో పాటు, కరీంనగర్‌కు చెందిన​ న్యాయవాది శ్రీనివాస్, బీడీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు తుషార్‌, కేరళకు చెందిన డాక్టర్  జగ్గు స్వామిలకు సిట్ నోటీసులు జారీచేసింది. ఈ నెల 21వ తేదీన విచారణకు రావాల్సిందిగా తెలిసింది. అయితే ఇందులో బండి సంజయ్‌కు సన్నిహితుడైన శ్రీనివాస్ మాత్రమే విచారణకు హాజరయ్యారు. సోమవారం శ్రీనివాస్ విచారణకు హాజరు కాగా.. సిట్ అధికారులు ఆయనను 8 గంటల పాటు విచారించారు. సింహయాజీకి ఫ్లైట్ టిక్కెట్ బుకింగ్ సహా పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. మంగళవారం మరోమారు శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరయ్యారు. 

ఇక, విచారణకు హాజరుకాని బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలపై సిట్ అధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న జగ్గు స్వామిపై సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేరళకు చెందిన జగ్గు స్వామికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాకపోవడంతో కేరళలోని ఓ ఆశ్రమ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. తాజాగా విచారణకు ఆయన గైర్హాజరుకావడంతో సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. 

click me!