తెలంగాణ బిజెపికి మరో షాక్

First Published Jan 11, 2018, 7:46 PM IST
Highlights
  • నాగం కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం
  • టిఆర్ఎస్ పై పోరాటంలో ఫెయిల్ అయితున్నామని ఆవేదన
  • కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం
  • నాకు 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరు వల్ల పార్టీలో కొందరు నేతలు ఇమడలేకపోతున్నారు. ఇటీవల కాలంలో బిజెపిలో ఫ్యూచర్ లేదన్న ఉద్దేశంతో నేతలు బయటి పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇటీవలకాలంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు రవలి కూచన బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. కొద్దిరోజుల్లోనే వరంగల్ జిల్లా నేత కొమ్మూరి ప్రతాపరెడ్డి బిజెపికి గుడ్ బై చెప్పారు. ఆయన టిఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. త్వరలోనే టిఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

పాలమూరు సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సైతం బిజిపిని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని చెబుతున్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో టిఆరఎస్ కు ధీటుగా వ్యవహరించడంలేదన్న అసంతృప్తితో నాగం ఉన్నట్లు చెబుతున్నారు. టిఆర్ఎస్ వైఫల్యాల మీద గట్టి పోరాటం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయనకు పార్టీ నేతల నుంచి సపోర్ట్ లభించడంలేదన్న చర్చ ఉంది. దీనికితోడు రానున్న ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ అండర్ స్టాండింగ్ తో పోటీ చేస్తాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పై గట్టి ఫైట్ చేయాలంటే బిజెపిలో ఉంటే సాధ్యం కాదన్న భావనలో నాగం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే ఆయన బిజెపిని వీడాలని సంకల్పించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జనవరి నెలాఖరులోనే నాగం కాంగ్రెస్ లో చేరడం ఖాయమని పాలమూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడు ఏషియానెట్ కు తెలిపారు. బిజెపిలో ఉన్నా.. టిఆర్ఎస్ లో ఉన్నట్లే కాబట్టే నాగం బిజెపిని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని ఆయన పేర్కొన్నారు.

పార్టీ మార విషయంలో నాగం జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇంకా పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అని చెప్పారు. కార్యకర్తలను సంప్రదించి వారితో మాట్లాడుతానని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు నడుచుకుంటానని వివరించారు.

నాగం జనార్దన్ రెడ్డి జెఎసి ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా సాగింది. అయితే జెఎసి పార్టీ విషయంలో కోదండరాం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. జెఎసి పార్టీ వస్తుందా రాదా అన్న మీమాంస ఉన్న సమయంలో అటువైపు చూసే కంటే రెడీమేడ్ గా టిఆర్ఎస్ కు ధీటైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అన్న భావనలో నాగం వర్గం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ బిజెపిలో ఇంతకాలం ఉక్కిరిబిక్కిరి అయిన నాగం వలసబాట పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

click me!