తెలంగాణ తెర మీదికి కొత్త ఫ్రంట్

First Published Jan 11, 2018, 6:13 PM IST
Highlights
  • సిపిఎంతో పాటు మొత్తం 28 పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్
  • ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్ గా ప్రకటన
  • సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలకు ఆహ్వానం
  • 25న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ

తెలంగాణలో కొత్త రాజకీయ ఫ్రంట్ ఆవిర్భవించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త రాజకీయ శక్తిగా నిలబడేందుకు 28 పార్టీలతో ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మాణం జరిగింది. ఫ్రంట్ అధ్యక్షుడు గా మాజీ వైసిపి నేత నల్లా సూర్య ప్రకాష్, కన్వీనర్ గా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు.

పూలే-అంబేద్కర్-మార్క్స్ ఆలోచనల మేళవింపుతో ఈ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు నేతలు తెలిపారు. ఫ్రంట్ పేరును బహుజన లెఫ్ట్ ఫ్రంట్ గా ప్రకటించారు. బిఎల్ఎఫ్ ముసాయిదాను ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో  బిఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఈనెల 25న హైదరాబాద్ లో 28పార్టీల ఐక్యవేదిక బహిరంగ సభ నిర్వహిస్తామన్నారరు. ఈ బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో పాటు చాలామంది జాతీయ నాయకులు, మేధావులు హాజరవుతారన్నారు. తమ ఫ్రంట్ ఇప్పుడు అధికారంలో ఉన్నపార్టీనో, ముఖ్యమంత్రినో దించేసి, కొత్త పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాదని స్పష్టం చేశారు.

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... ధనికులకు దాసోహమవుతున్న విధానాన్ని మార్చడమే ఈ ఫ్రంట్ లక్ష్యమని ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ప్రజల కష్టాలు తీరుతాయనుకున్నా ఆ ఆశలు ఇప్పుడు నీరుగారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదికగానే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటైందన్నారు. రాజకీయాల్లో అన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే బీఎల్ఎఫ్ లక్ష్యమని ప్రకటించారు.

రాబోయే ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. ఇప్పుడున్న 28 పార్టీలతో పాటు సీపీఐ, న్యూడెమోక్రసీతో పాటు ఇతర వామపక్ష పార్టీలను కూడా ఈ ఫ్రంట్ లో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. వారి చేరికతో బీఎల్ఎఫ్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.

బిఎల్ఎఫ్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన రాజకీయ నాయకత్వం అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న వ్యక్తుల పాలనకన్నా... తమ ఫ్రంట్ అధికారంలోకి వస్తే... మెరుగైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం కోసం తమ ఫ్రంట్ పని చేస్తుందని ప్రకటించారు.

click me!