టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కేసీఆర్ అల్లిన కట్టుకథ అని బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలన్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగిన వ్యవహారం సీఎం కేసీఆర్ అల్లిన కట్టుకథ అని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ఆరోపిపంచారు. ఈ కుట్రతో పోలీసులు భాగస్వామయ్యం కావొద్దని సూచించారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశం మీద సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ పై న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు లక్ష్మణ్ చెప్పారు.
ఇదిలా ఉండగా, ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టిఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడులో దెబ్బ తినబోతోందని హైదరాబాద్ వేదికగా డ్రామాలకు తెరలేపారని అన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు కేసీఆర్ ఆ స్వామీజీలను పిలిపించుకుని మాట్లాడారని, అక్కడే స్క్రిప్టు రాసి.. అమలు చేస్తున్నారని అన్నారు. బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సీఎంకు సవాల్ విసురుతున్నా.. మీరు యాదాద్రి వస్తారా? టైం, తేదీ మీరే చెప్పండి. బిజెపి తరఫున ఎవరు కోరుకుంటే వాళ్ళం వస్తాం. ఈ డ్రామా తో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా?’ అని ప్రశ్నించారు.
ఆపరేషన్ ఆకర్ష్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు.. బయటపడిందిలా... (గ్యాలరీ)
ఈ వ్యవహారానికి పూర్తి స్క్రీన్ ప్లే, దర్శకత్వం ప్రగతిభవన్ నుంచి నడిచిందని, సీఎం కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ఇందులో సైబరాబాద్ కమిషనర్ నటుడిగా మారారని అన్నారు. గతంలో మంత్రిపై హత్యాయత్నం అంటూ డ్రామాలు ఆడారని అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు సరికొత్త నాటకమాడుతున్నారని అన్నారు. కొన్ని సీన్లు ముందే పోలీసులు రికార్డు చేసి పెట్టుకున్నారని వివరించారు.
ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ లో నాలుగు రోజులుగా సీసీ కెమెరా ఫుటేజీలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రగతి భవన్ సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెడితే సీఎం ఆడుతున్న డ్రామా అంతా బయట పడుతుందని అన్నారు. మునుగోడుకు చెందిన టిఆర్ఎస్ నాయకుడు ఒకరు డెక్కన్ కిచెన్ హోటల్లోనే మూడు రోజులుగా మకాం వేశారు. ఫామ్హౌస్లో కనిపించిన ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు ప్రగతి భవన్ కు రోజూ ఉదయం వెళ్లి రాత్రి వస్తున్నారు.
ఎమ్మెల్యేలను పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి స్టేట్మెంట్ చేయకుండా ఎలా వదిలేస్తారు? వారి నెత్తిమీద రూపాయి పెడితే.. అర్థరూపాయికి కూడా ఎవరూ కొనరు. ఏడాది అధికారంలో ఉండేందుకు రూ.వంద కోట్లు ఇస్తే.. మూడేళ్లుగా ఎన్ని వందల కోట్లు ఇచ్చారు? వాస్తవానికి ఎన్నికల తర్వాత డ్రామా ఆడదామని కెసిఆర్ ప్లాన్ చేశారు. ముందుగానే అమలు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న స్వామీజీ పరిగి వద్ద ఓ ఫామ్హోజ్లో కొందర్ని కలిశారు.
గత మూడు రోజులుగా స్వామీజీలు, నందకుమార్, ఎమ్మెల్యేల కాల్ డేటా బయటపెట్టాలి. ఈ మధ్యనే టీఆర్ఎస్లో చేరిన ఓ నాయకుడితో బెంగుళూరులో బేరసారాలు జరిగాయి. నందకుమార్ గుట్కా వ్యాపారి. ఆ ఫార్మ్ హౌస్ గుట్కా వ్యాపారానికి అడ్డాగా మారింది. అహంకారం తలకెక్కి బీజేపీపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. స్వామీజీలు. సాధుసంతులపై దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ ధర్మంపై తప్పుడు సంకేతాలు ఇచ్చే కుట్రలో భాగంగా ఇదంతా జరిగింది. దీన్ని ‘ హిందూ సమాజం క్షమించదు’ అని సంజయ్ అన్నారు.