మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ తో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ ఇవాళ సమావేశమయ్యారు.
హైదరాబాద్: తనకు మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ కు కామన్ ఎజెండా ఉందని బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ చెప్పారు. ఆదివారంనాడు మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ తో ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దించడంలో కలిసి పనిచేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.
అతి చిన్న వయస్సులోనే చంద్రశేఖర్ ఎమ్మేల్యే అయ్యారన్నారు. మూడు దఫాలు మంత్రిగా చంద్రశేఖర్ పని చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రశేఖర్ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి పనిచేశామన్నారు.
ఎస్‌సీ వర్గీకరణ విషయంలో బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ విషయమై అధిష్టానంతో చర్చలు జరుపుతామన్నారు.కర్ణాటకలో హామీ ఇచ్చామన్నారు. తెలంగాణలో కూడా వర్గీకరణకు కృషి చేస్తామని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడుతారని మీడియా విష ప్రచారం చేస్తుందన్నారు.పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పార్టీ బలోపేతంపై చర్చించాం
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్టుగా మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ చెప్పారు.తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామా చేసి కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారు.తెలంగాణ బాగుపడాలని మేము చర్చించామన్నారు.
నేతలతో ఈటల సమావేశాలు
బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మెన్ గా ఈటల రాజేందర్ నియమితులైన సమయంలో పలువురితో సమావేశమౌతున్నారు . పార్టీ మారుతున్నారనే ప్రచారం ఉన్న నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మారొద్దని నేతలను కోరుతున్నారు. రానున్న రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. పార్టీ వీడకుండా నేతలను బుజ్జగిస్తున్నారు.తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. బీజేపీ అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పించారు. ఈ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్ ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.