బంజారాహిల్స్ లోని బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత

First Published Apr 21, 2018, 6:35 PM IST
Highlights

బంజారాహిల్స్ లోని బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత  

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాసం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 లోని  బాలయ్య ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. ఆందోళనకారులు బాలకృష్ణ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రదాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు నిరసనకు దిగిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్‌ చేసి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా అన్యాయం చేసినందుకు నిరసనగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా  ఇప్పటికే ఎపిలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ప్రధానిని విమర్శించిన ఎమ్మెల్యే బాలకృష్ణ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని వారు గవర్నకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక  రాష్ర్టవ్యాప్తంగా బీజేపీ నేతలు బాలకృష్ణ దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తున్నారు. ఈ నిరసనల పెగ ఇపుడు ఏపితో పాటు తెలంగాణ కు పాకింది.

click me!