తనకు ఫోన్ చేసిన వెంకటరమణ అనే కార్యకర్తను మాజీ మంత్రి బాబుమోహన్ తిట్ల దండకం అందుకున్నారు. ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్: తనకు ఫోన్ చేసిన వెంకటరమణ అనే కార్యకర్తను మాజీ మంత్రి బీజేపీ నేత బాబు మోహన్ దూషించారు. ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జోగిపేటకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త బాబు మోహన్ కు ఫోన్ చేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనకు మరోసారి ఫోన్ చేయవద్దని బాబు మోహన్ వెంకటరమణకు వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానని బాబు మోహన్ అన్నట్టుగా ఈ ఆడియో సంభాషణలో ఉంది. తాను కావాలో నీవు కావాలో పార్టీలో తేల్చుకుంటానని కూడ బాబు మోహన్ చెప్పారు.
తాను ప్రపంచస్థాయి నాయకుడిగా బాబు మోహన్ వెంకటరమణతో వ్యాఖ్యానించినట్టుగా ఉంది . రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కోసం పనిచేయాలని తనను అమిత్ షా పార్టీలో చేర్చుకున్నారని బాబు మోహన్ వెంకటరమణతో చెప్పినట్టుగా ఈ ఆడియో సంభాషణ ఉందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. నీవెంత నీ బతుకెంత అని కూడా బీజేపీ కార్యకర్తపై బాబుమోహన్ మండిపడ్డారు. అవసరమైతే తాను బీజేపీకి రాజీనామా చేస్తానని కూడా బాబుమోహన్ వ్యాఖ్యలు చేశారని ఆ ఆడియో సంభాషణలో ఉందని ఈ కథనం తెలిపింది.
అయితే వెంకటరమణతో మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో సంభాషణ బాబు మోహన్ మాట్లాడిందేనా , ఆయన మాదిరిగా ఎవరైనా మాట్లాడారా అనే విషయం ఫోరెన్సిక్ నిపుణులు తేలుస్తారు. ఈ ఆడియో సంభాషణపై పార్టీ నాయకత్వం తో పాటు బాబు మోహన్ ఎలా స్పందిస్తారో చూడాలి.